లోకేష్ పుట్టిన రోజు.. సంబరాలు సరే.. సందేశాల మాటేంటి..!
అంతేకాదు.. ఒకప్పుడు.. చంద్రబాబు తర్వాత ఎవరు? అంటే.. ఏవేవో పేర్లు తెరమీదికి వచ్చేవి.
By: Tupaki Desk | 23 Jan 2025 11:35 AM GMTటీడీపీ యువతరం నాయకుడు, మంత్రి నారా లోకేష్ 42వ పుట్టిన రోజును ఆ పార్టీ నాయకులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. దేశ విదేశాల్లోనూ నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. టీడీపీ విషయంలో నిన్న మొన్నటి వరకు ఉన్న `వారసత్వ` చర్చకు ఫుల్ స్టాప్ పడి.. ఐకాన్ నాయకుడిగా, భవిష్యత్తు పార్టీ దిశానిర్దేశకుడిగా నారా లోకేష్ ఎదుగుతున్న.. ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. అంతేకాదు.. ఒకప్పుడు.. చంద్రబాబు తర్వాత ఎవరు? అంటే.. ఏవేవో పేర్లు తెరమీదికి వచ్చేవి. కానీ.. నేడు అవన్నీ పోయి నారా లోకేష్ పేరు మాత్రమే వినిపిస్తోంది.
దీనికి కారణం.. అకుంఠిత దీక్ష, పట్టుదల, శ్రమ, వ్యూహం.. ఈ నాలుగు అంశాలను తన రాజకీయ రథానికి చక్రాలుగా మలుచుకున్న నారా లోకేష్.. అలుపెరుగని యుద్ధంలో విజయం దక్కించుకున్నారు. ఇక.. లోకేష్ పుట్టిన రోజు సంబరాలు చేసుకుంటున్న తమ్ముళ్లు.. ఆయన ఎదిగిన తీరులో మనకు కనిపించే .. వినిపించే సందేశాలను కూడా ఒంటబట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం నారా లోకేష్ పుట్టిన రోజును సంబరాలకే పరిమితం చేయరాదని కూడా చెబుతున్నారు.
లోకేష్ రాజకీయ జీవితంలో చెప్పని సందేశాలు!
+ ఓటమి నుంచి.. కుంగిపోవడం కామనే. కానీ, నారా లోకేష్ ఎక్కడ ఓడారో.. అక్కడే పట్టుబట్టి ప్రజల మన సు చూరగొన్నారు. మంగళగిరిలో విజయం దక్కించుకున్నారు. అది కూడా కనీ వినీ ఎరుగని మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. ఇది నేటి తరం యువ నేతలకు అత్యంత అవసరమైన సందేశం. ఓటమితో వెనుదిరిగే నాయకులకు కూడా ఇది పాఠం.
+ అవమానాలు రావడం.. రాజకీయాల్లో కామనైపోయింది. అయితే.. ఒకప్పటికి.. ఇప్పటికి.. వ్యక్తిగత జీవిత అంశాలను కూడా ప్రత్యర్థులు ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి అనేక అవమానాలు నారా లోకేష్‌కు కూడా ఎదురయ్యారు. తొలుత ఆయన బాడీని విమర్శించారు. తర్వాత.. ఆయనకు మాట్లాడడమే రాదంటూ.. ప్రత్యర్థి పార్టీ నాయకులు దుయ్యబట్టారు. చివరాఖరుకు.. తల్లి భువనేశ్వరిపైనే అభాండాలు వేస్తూ.. దుష్ప్రచారం చేశారు. సభ్య సమాజం చెప్పుకోలేని విధంగా చేశారు. అయినా.. లోకేష్ భరించారు. పంటి బిగువున బాధను తట్టుకున్నారు. రాజకీయంగా పోరాటం చేశారు. ఇది అవమానాలు ఎదుర్కొనే నేటి తరం నాయకులకు స్ఫూర్తి మంత్రం.
+ భేషజాలు అనేవి ఏ పార్టీలో అయినా కామనే. సీనియర్ల మాటే నెగ్గాలన్న పట్టుదల కూడా కనిపిస్తుంది. ఈ విషయంలో 45 ఏళ్ల టీడీపీలో మరిన్ని పట్టుదలలు కనిపిస్తాయి. ఇలాంటివి నారా లోకేష్‌కు కూడా ఎదురయ్యాయి. ఒకానొక దశలో సీనియర్లు ఆయనకు చోటు పెట్టలేదు. అయినా.. తట్టుకుని నిలబడ్డారు. ఏ సీనియర్లు అయితే.. ఆయనను కాదన్నారో.. వారితోనే ప్రశంసించుకునేలా తన మార్గం వేసుకున్నారు. ఇది కూడా భవిష్యత్తు తరాల టీడీపీ నేతలకు స్ఫూర్తి నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో.. సంబరాలు చేసుకోవడం అవసరమే అయినా.. నారా లోకేష్ నడిచిన మార్గం.. రెడ్ కార్పెట్ కాదని.. తండ్రి సీఎం అయినా.. తాత సీఎం అయినా.. అవేవీ ఆయన విషయంలో పనిచేయలేదన్న వాస్తవాన్ని.. నేటి తరం వారసులు గుర్తించాలి. తమదైన మార్గాలను వేసుకుని ముందుకు సాగాలి. అప్పుడే.. నేతలుగా నిలబడతారు.