Begin typing your search above and press return to search.

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నారా లోకేష్ !

ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏపీకి ఫస్ట్ టైం అందునా విశాఖకు నరేంద్ర మోడీ వచ్చారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 3:45 AM GMT
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నారా లోకేష్ !
X

ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏపీకి ఫస్ట్ టైం అందునా విశాఖకు నరేంద్ర మోడీ వచ్చారు. ఆయన సభలో కచ్చితంగా అటూ ఇటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉంటారని అందరికీ తెలుసు. వేదిక మీద ఆ ఇద్దరే మాట్లాడుతారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా నారా లోకేష్ కూడా మాట్లాడారు. ఆయన పవన్ కంటే ముందు మాట్లాడారు. దాదాపుగా పది నిమిషాల పాటు మాట్లాడిన లోకేష్ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. నమో గారు అంటూ మోడీని కూడా ఆకర్షించారు.

మోడీ దేశానికి ఏమిటి చేశారు ఆయన అవసరం ఏమిటి అంటూ లోకేష్ చేసిన ఈ ప్రసంగం ఒక విధంగా బాగా సాగింది అనే చెప్పాలి. లోకేష్ ఎలాంటి తడబాటు పొరపాటు లేకుండా ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇలా అన్నీ కలుపుతూ చేసిన స్పీచ్ ఆధ్యంతం అలరించింది.

లోకేష్ బాగానే రాటు తేలారు అని ఈ స్పీచ్ ని విన్న వారు అంతా అనుకునే మాట. ఏపీలో కూటమిలో చంద్రబాబు పవన్ ఇద్దరితో పాటు లోకేష్ కూడా అత్యంత కీలకం అని సభా వేదిక మీద ఆయన ఇచ్చిన స్పీచ్ ఆయనకు దక్కిన ప్రాధాన్యత తెలియచేసింది. అంతే కాదు మోడీకి స్వాగతం పలుకుతూ విశాఖ నిండా వెలసిన ఫ్లెక్సీలలో ఎక్కడ చూసినా మోడీకి అటూ టూ చంద్రబాబు పవన్ లతో పాటు నారా లోకేష్ ఫోటోలు కనిపించాయి.

దాంతో ఏపీకి ఒక సీఎం ఇద్దరు డిప్యూటీలు అని అంతా అనుకునే లాగా ఈ ఫ్లెక్సీలు ఎన్నో అర్థాలు చెప్పాయని అంటున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత నారా లోకేష్ నే. అక్కడ ఎలాంటి పేచీ పూచీ లేదు. కానీ ప్రభుత్వంలో చూస్తే బాబు తరువాత పవన్ కళ్యాణ్ అని వస్తోంది.

దాంతో లోకేష్ మంత్రిగా ఎన్ని మార్కులు సంపాదించిన ఎంతలా తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నా ఆయన ఎలివేట్ కాలేదని టీడీపీ యంగ్ టీం లో ఉంది అని అంటున్నారు. ఆ లోటుని తీర్చే విధంగా ప్రధాని వంటి దేశ పెద్ద వచ్చిన కార్యక్రమంలో లోకేష్ కి పెద్ద పీట వేసి ఆయన స్థానం కూటమి ప్రభుత్వంలో ఏమిటో చెప్పకనే చెప్పారు.

అయితే కూటమిలో ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఉండాలని పవన్ కోరారని ఆగారు కానీ రెండవ పోస్టు ఉంటే కనుక అది కచ్చితంగా లోకేష్ దే అని అంటున్నారు. అయినా కానీ లోకేష్ అనధికార డిప్యూటీ సీఎం నే అని అంటున్నారు. మొత్తానికి మోడీ విశాఖ వచ్చి లక్షల విలువ చేసే ప్రాజెక్టులను ప్రారంభించడం కాదు అంతకంటే లక్షణమైన తెలుగుదేశం భావి వారసుడు లోకేష్ మాత్రమే సుమా అని మరింత బలంగా చాటి చెప్పారా అన్న చర్చ అయితే నడుస్తోంది. అదన్న మాట మ్యాటర్.