Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై లోకేష్ అసంతృప్తి... కీలక వ్యాఖ్యలు!

అవును... ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ వెళ్లారు.

By:  Tupaki Desk   |   18 Jan 2025 2:06 PM GMT
ఎన్టీఆర్  ఘాట్  నిర్వహణపై  లోకేష్  అసంతృప్తి... కీలక వ్యాఖ్యలు!
X

శనివారం నందమూరి తారకరామారావు 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి వారసులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నేతలు పలువురు నివాళులు అర్పించారు. ఈ సమయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఘాట్ నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ వెళ్లారు. ఈ సమయంలో ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘాట్ గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోవడం.. గార్డెన్ లోని లైట్లు విరిగిపోయి ఉండటాన్ని గమనించి స్పందించారు.

ఇందులో భాగంగా... సొంత నిధులతో ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులు చేపట్టాలని తన సిబ్బందిని ఆదేశించారు. దీనికోసం అవసరమైన అన్ని అనుమతులు తీసుకొని వీలైనంత తొందరగా ఘాట్ మరమ్మతులు సొంత పూర్తి చేయాలని లోకేష్ నిర్ణయించారు. దీనికోసం పూర్తి సొంత నిధులు వినియోగించాలని ఫిక్సయ్యారు!

ఈ సందర్భంగా.. ఘాట్ నిర్వహణ బాధ్యతలను ఎన్టీఆర్ ట్రస్టుకు అప్పగించాలని పలుమార్లు తెలంగాణ గత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా... ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్.ఎం.డీ.ఏ) తీరు పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.