సొంత పార్టీపై లోకేష్ అసంతృప్తి.. రీజనేంటి..!
అలాంటి పొలిట్ బ్యూరోపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీస్తున్నాయి.
By: Tupaki Desk | 16 Jan 2025 4:30 PM GMTతమ ఫ్యామిలీ సొంత పార్టీ టీడీపీపై మంత్రి నారా లోకేష్ అసంతృప్తితో ఉన్నారా? ముఖ్యంగా పార్టీ పొలిట్ బ్యూరో వ్యవహార శైలిపై ఆయన మరింత అసంతృప్తి చెందుతున్నారా? అంటే.. తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. పార్టీకి పొలిట్ బ్యూరో చాలా కీలకం. ఎన్నికల సమయంలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక నుంచి కీలక నిర్ణయాల వరకు కూడా ఇది కీలకంగా పనిచేస్తుంది. పార్టీ విధి విధానాలను కూడా రూపొందించే క్రతువులో భాగమవుతుంది.
అలాంటి పొలిట్ బ్యూరోపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కొందరు సీనియర్లపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ పొలిట్ బ్యూరోను సంస్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కనీసం 30 శాతం మందిని మార్చి.. యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. వాస్తవానికి నారా లోకేష్ పొలిట్ బ్యూరోలో లేరు. సీనియర్లకు మాత్రమే దీనిలో చోటు ఉంది. ఇప్పుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలు వారిని ఉద్దేశించే అయి ఉంటాయని అంటున్నారు.
యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతి రాజు, వర్ల రామయ్య వంటి వారు టీడీపీ పొలిట్ బ్యూరోలో ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే పొలిట్ బ్యూరో.. చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుంది. అయితే.. కొన్నాళ్లుగా సీనియర్లు సరిగా పనిచేయడం లేదని.. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. అలాగని నేరుగా ఎప్పుడు ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు. అలాంటిది తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కుదుపునకు కారణమయ్యాయి.
దీనిని బట్టి వచ్చే రోజుల్లో పొలిట్ బ్యూరోను సంస్కరించే అవకాశం కనిపిస్తోంది. అంటే.. సీనియర్లలో 30 శాతం మందిని పక్కన పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 23 మంది పొలిట్ బ్యూరోలో సభ్యులుగా ఉన్నారు. వీరిలో 5 నుంచి ఆరుగురు వరకు పక్కకు తప్పించి.. వారి స్థానంలో యువతకు ప్రాధాన్యం ఇస్తే.. పార్టీ పరుగులు పెడుతుందని నారా లోకేష్ అభిప్రాయంగా ఉంది. అయితే.. పొలిట్ బ్యూరోలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. మార్పులు చేయాలన్నా చంద్రబాబుచేతిలో ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.