రామ్ముర్తినాయుడి మృతిపై ప్రధాని మోడీ లేఖ.. రిప్లై ఇచ్చిన నారా రోహిత్!
ఈ సమయంలో.. కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాయగా.. రోహిత్ ధన్యవాదాలు తెలిపారు.
By: Tupaki Desk | 19 Nov 2024 5:48 AM GMTసినీ నటుడు, నిర్మాత నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తినాయుడు ఇటీవల అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనంతరం.. ఆయన అంత్యక్రియలు నారావారిపల్లిలో అధికార లాంఛనాలతో జరిగాయి. ఈ సమయంలో.. కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాయగా.. రోహిత్ ధన్యవాదాలు తెలిపారు.
అవును... నారా రోహిత్ కు బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. ఈ సందర్భంగా నారా రామ్మూర్తినాయుడి మరణవార్తను దుఖంతో, భాదతో విన్నట్లు తెలిపారు! ఆ నష్టం ఎప్పటికీ పూరించలేని శూన్యాన్ని మిగిల్చిందని అన్నారు! ప్రజా ప్రతినిధిగా రామ్ముర్తినాయుడిని ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారని తెలిపారు.
ఇదే సమయంలో.. రామ్మూర్తి నాయుడి నిరాడంబరమైన నడవడిక అందరిపైనా ప్రభావం చూపిందని.. ఆయన అందించిన విలువలు కుటుంబానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాని అన్నారు. ఆయనతో గడిపిన సమయాల జ్ఞాపకాలు ఈ కష్ట సమయంలో మీకు ఓదర్పును అందిస్తాయని ఆశిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.
ఈ సందర్భంగా "ఈ ఘోరమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని, ధైర్యం మీకు కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ.. ఓం శాంతి" అంటూ నారా రోహిత్ కు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు!
దీనిపై స్పందించిన నారా రోహిత్.. తన తండ్రి మృతికి సంతాపాన్ని తెల్లియజేస్తూ లేఖ రాసినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్ట సమయంలో మీ హృదయపూర్వక మాటలు నా, నా కుటుంబానికి అపారమైన శక్తిని, ఓదార్పును ఇచ్చాయని వెల్లడించారు. మీ నుంచి ఇలాంటి మద్దతు పొందడం నిజంగా ఓదార్పునిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా.. మీరు రాసిన లేఖ ఈ తీవ్ర నష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనే విశ్వాసాన్ని కలిగించింది.. మీ ఆలోచనాత్మకమైన ధోరణికి తాను చాలా కృతజ్ఞుడను అని నారా రోహిత్ స్పందించారు.