Begin typing your search above and press return to search.

నారా రోహిత్ కాబోయే భార్య ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదేనట

సైలెంట్ గా సర్ ప్రైజ్ ఇచ్చారు సినీ హీరో నారా రోహిత్. తనదైన మార్క్ సినిమాలు చేసుకుంటూ ఉండే ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో వచ్చింది లేదు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 5:16 AM GMT
నారా రోహిత్ కాబోయే భార్య ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదేనట
X

సైలెంట్ గా సర్ ప్రైజ్ ఇచ్చారు సినీ హీరో నారా రోహిత్. తనదైన మార్క్ సినిమాలు చేసుకుంటూ ఉండే ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో వచ్చింది లేదు. ఆయన సినిమాలకు సంబంధించి చూసినప్పుడు కూడా అనవసరమైన విషయాల్లో పెద్దగా కలుగజేసుకున్నట్లుగా కనిపించరు. మీడియాకు సైతం లిమిటెడ్ యాక్సిస్ అన్నట్లు వ్యవహరించే రోహిత్ ఆన్ స్క్రీన్ విషయాలే కాస్త వార్తలుగా వస్తాయి కానీ ఆఫ్ స్క్రీన్ విషయాలు అస్సలు బయటకు రావు. అలాంటి అతడి ఎంగేజ్ మెంట్ ఒక్కసారి అందరిని సర్ ప్రైజ్ గా మారింది. కారణం.. అతను హీరోగా నటించిన ప్రతినిధి 2 లో హీరోయిన్ గా నటించిన శిరీషను ఎంగేజ్ మెంట్ చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.


ఇంతకూ హీరోయిన్ శీరిష ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమె కుటుంబం గురించిన వివరాల్ని ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. శిరీష పక్కా ఆంధ్రానే. తెలుగు అమ్మాయే అయినప్పటికీ ఆ వివరాలు సినిమా విడుదల వేళలోనూ పెద్దగా ఫోకస్ కాలేదు. ఇక.. శిరీష కుటుంబం విషయానికి వస్తే.. వారిది ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రెంటచింతల గ్రామం. పల్నాడులోని ఈ గ్రామంలో సామాన్య రైతు కుటుంబంగా సుపరిచితం. అయితే.. ముప్ఫై ఏళ్ల క్రితం వారు గురజాల మండలం దైద గ్రామానికి చెందిన వారు. అక్కడి నుంచి రెంటచింతలకు వలస వచ్చి అక్కడే ఉండిపోయారు.


శిరీష తండ్రి నాగేశ్వరరావు వ్యవసాయం చేస్తుండేవారు. ఆయనకు నలుగురు కుమార్తెలు. అందరిని బాగా చదివించారు. పెద్దమ్మాయి శ్రీలక్ష్మి రెంటచింతలలో అంగన్ వాడీ సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు. రెండో కుమార్తె భవానీ పెళ్లైన తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. మూడో అమ్మాయి ప్రియాంక పెళ్లి తర్వాత హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. నాలుగో అమ్మాయి శిరీష. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె.. అక్కడే కొంతకాలం జాబ్ చేశారు.


సినిమాల మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చారు. తన అక్క ప్రియాంక ఇంట్లో ఉంటూ సినిమాల్లో అవకాశాలకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి2లో హీరోయిన్ గా అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా చేసే సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలై.. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ ఏడాది మే 10న విడుదలైన ఈ మూవీ వాణిజ్య పరంగా సక్సెస్ కాలేదు. కాకుంటే.. సినిమా రిలీజ్ అయిన ఐదు నెలలకు పెళ్లి పీటలకు విషయం రావటం.. ఆదివారం వారి ఎంగేజ్ మెంట్ జరగటంతో శిరీష కుటుంబం మీద బోలెడంత ఆసక్తి వ్యక్తమైంది. మొత్తంగా నారా రోహిత్ పెళ్లాడనున్న అమ్మాయి పక్కా ఆంధ్రానే కాదు.. పల్నాడు జిల్లా అల్లుడయ్యారు.