మరోసారి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు!
తాజాగా తూర్పుగోదావరి జిల్లా సీతాన గరంలో జరిగిన టీడీపీ రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని భువనేశ్వరి సందర్శించారు
By: Tupaki Desk | 27 Sep 2023 8:41 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు అయినప్పటి నుంచి ఆమె తన కోడలు బ్రాహ్మణితో కలిసి రాజమండ్రిలోనే ఉంటున్నారు. ములాఖతుల ద్వారా చంద్రబాబును తరచూ కలుస్తున్నారు. అలాగే తమను పరామర్శించడానికి వచ్చినవారికి కృతజ్ఞతలు తెలపడంతోపాటు సంఘీభావ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా సీతాన గరంలో జరిగిన టీడీపీ రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని భువనేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని.. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ప్రజల సొమ్ము దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబుకు లేదని కుండబద్దలు కొట్టారు.
చంద్రబాబు ఏం తప్పు చేశారని 19 రోజులుగా జైలులో నిర్బంధించారని నిలదీశారు. ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా? అని ప్రశ్నించారు. ఈ ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోరా? అని నిలదీశారు. ఇప్పటివరకు ఆయన ఏం తప్పు చేశారో చెప్పలేకపోయారన్నారు. అరెస్టు చేశారు కానీ.. ఆధారాలు మాత్రం చూపించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజల మనిషిని జైల్లో నిర్బంధించారని భువనేశ్వరి మండిపడ్డారు. శాంతియుత నిరసనలనూ పోలీసులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్రను కూడా పలుమార్లు అడ్డుకున్నారని నిప్పులు చెరిగారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందిన యువత రూ.లక్షలు సంపాదిస్తున్నారని భువనేశ్వరి గుర్తు చేశారు. చేయి చేయి కలిపి ప్రజలంతా చంద్రబాబుకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా సీఐడీ అధికారులు తన భర్తను అరెస్టు చేశారని.. ఇలాంటి ఘటనను తానెక్కడా చూడలేదని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతి జరిగితే ఆధారాలు సేకరించి.. వాటిని చూపించి అరెస్ట్ చేయాలన్నారు. అలా చేస్తే ఎవరూ తప్పుబట్టరన్నారు. కానీ ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేశాక ఆధారాలు సేకరించే పనిలో ఉన్న సీఐడీ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారని దుయ్యబట్టారు.
స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి డబ్బులు దారి మళ్లించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారని.. అయితే ఆ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయో ఇప్పుడు వరకు íసీఐడీ అధికారులు చూపించలేకపోయారని భువనేశ్వరి గుర్తు చేశారు.
సీఐడీ అధికారులు విచారణలో కూడా చంద్రబాబే వారిని తిరిగి ప్రశ్నలు అడిగి ఉంటారన్నారు. 40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్న చంద్రబాబు .. నిరంతరం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం, యువత ఉద్యోగాల కోసమే పనిచేశారన్నారు. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎంతోమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని..స్కిల్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత సుమారు రెండు లక్షల మందికి దారి చూపించారని భువనేశ్వరి తెలిపారు. యువతకు ఇది ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు. పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించడం వల్ల మహిళలకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు.
శాంతియుతంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని భువనేశ్వరి ఆరోపించారు. ఈ సృష్టికి ఒక మూలకర్త ఒక మహిళనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు అంటూ మండిపడ్డారు. శాంతియుతంగా మనమందరం కలిసి పోరాటం చేద్దాం అని ఈ సందర్భంగా మహిళలకు భువనేశ్వరి పిలుపునిచ్చారు.
లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రను కూడా అనేక విధాలుగా పోలీసులు ఇబ్బంది పెట్టారని..అయినా ఏదీ ఆగదని అన్నారు. మాజీ ఎంపీ 70 సంవత్సరాల నిండిన సీతామహాలక్ష్మి ఆస్పత్రిలో ఉంటే హత్యాయత్నం కేస్ పెట్టారని ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.