Begin typing your search above and press return to search.

నారా భువనేశ్వరికి షాక్.. నోటీసులు జారీచేసిన ఈసీ!

ప్రస్తుతం పలు రాష్ట్రాలతో పాటు ఏపీలో కూడా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 March 2024 5:23 AM GMT
నారా భువనేశ్వరికి షాక్.. నోటీసులు జారీచేసిన ఈసీ!
X

ప్రస్తుతం పలు రాష్ట్రాలతో పాటు ఏపీలో కూడా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానిపక్షంలో... ప్రత్యర్థులు ఫిర్యాదులు చేయడం, తర్వాత నోటీసులు జారీ చేయబడటం, నిరూపణ అయితే మొదటికే మోసం రావడం వంటి ప్రమాదాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా ఎన్నికల కమిషన్ వద్ద ఎలాంటి సిఫార్సులూ పనిచేయవనే సంగతి అంతా గుర్తుంచుకోవాలి! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు జారీ చేసింది!

అవును... టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఇందులో భాగంగా... ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే కారణంతో భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. భువనేశ్వరి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్ 24 గంటల్లో ఈ వ్యవహారం పై నివేధిక ఇవ్వవలసి ఉంటుందని తెలుస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బాబును అరెస్ట్ చేయగానే ఆ మనస్తాపంతో కొంతమంది కార్యకర్తలు, అభిమానులు మృతి చెందారని, వారి వారి కుటుంబాలకు అండగా ఉంటానంటూ నాడు భువనేశ్వరి మాట ఇచ్చారు. ఇచ్చినట్లుగానే అప్పుడప్పుడూ కొన్ని కొన్ని కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఆ సమయంలో చెక్కుల రూపంలో అందిస్తూ కాస్త ఆర్ధికసాయం చేస్తున్నారు.

ఈ సమయంలో "నిజం గెలవాలి" అంటూ ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సమర్పించారని తెలుస్తుంది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి.. ఎన్నికల ప్రధాన అధికారులను కలిసి ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కూడా భువనేశ్వరి చెక్కూలు పంపిణీ చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారని తెలుస్తుంది.

దీంతో... ఈ అంశంపై ఆమెకు ఈసీ నోటీసులు జారీచేసిందని తెలుస్తుంది. ఇదే సమయంలో.. ఈ వ్యవహారంపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం విచారణ జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో... ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తిగా మారింది.

కాగా... స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైన అనంతరం "నిజం గెలవాలి" పేరుతో నారా భువనేశ్వరి పర్యటనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బాబు అరెస్ట్ ను జీర్ణించుకోలేక, మనస్తాపానికి గురై మరణించారంటూ కొంతమంది కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించి, ఓదార్చారు. ఈ సమయంలో వారికి ఆర్థిక సాయం చేస్తూ, ఆ మేరకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. అయితే.. ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఆమె ఆ పని ఆపలేదనేది ఫిర్యాదని తెలుస్తుంది!