నారా భువనేశ్వరి పొలిటికల్ పాఠాలు.. చిన్నమ్మే ట్యూటర్!
యితే.. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపించడం, మరోవైపు.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల కు సమయం చేరువ కావడంతో నారా కుటుంబం కదులుతోంది.
By: Tupaki Desk | 23 Oct 2023 11:30 PM GMT'నిజం గెలవాలి'- నినాదంతో ఈ నెల 25 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి రానున్నారు. అయితే.. రాజకీయంగా అయినా, ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టడంగా అయినా.. ఆమెకు ఇదే తొలి అడుగు! ఇప్పటి వరకు టీడీపీని స్థాపించిన దరిమిలా.. రాజకీయంగా ఏనాడూనారా కుటుంబంలోని ఆడవాళ్లు బయటకు వచ్చింది లేదు. కేవలం వారి ఇల్లు, వ్యాపారం ఉంటే దానికి మాత్రమే పరిమితమయ్యారు.
అయితే.. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపించడం, మరోవైపు.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల కు సమయం చేరువ కావడంతో నారా కుటుంబం కదులుతోంది. ఈ క్రమంలోనే నిజం గెలవాలి.. నినాదంతో నారా భువనేశ్వరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు జైలుకు వెళ్లారనే మనస్తాపంతో మృతి చెందిన కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారికి ఆర్థిక సాయం చేస్తారని కూడా సమాచారం.
ఇదిలావుంటే.. ఈ యాత్రలో చిన్న పాటి సభలను కూడా టీడీపీ ప్లాన్ చేసింది. ఆయా సభల్లో నారా భువనేశ్వరి మాత్రమే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆమె ప్రజాబాహుళ్యంలోకి పెద్దగా రాకపోవడం, రాజకీయంగా ప్రసంగాలు చేసిన అనుభవం లేకపోవడం, ముఖ్యంగా వైసీపీ వంటి పార్టీని టార్గెట్ చేయడం వంటివి నారా భువనేశ్వరికి చాలా కొత్త. ఆమెకు తడబాట్లు తప్పేలా లేవు.
ఈ నేపథ్యంలో ప్రజాబాహుళ్యంలో ఎలా ప్రసంగించాలి? ఏయే అంశాలపై కార్నర్ చేయాలి? బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? అనే కీలక అంశాలపై తన అక్క,బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ నుంచి నారా భువనేశ్వరి రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నట్టు తెలుగు దేశం పార్టీ నాయకుల్లో గుసగుస వినిపిస్తోంది. పార్టీలు వేరైనా.. అంతిమ లక్ష్యం వైసీపీని సాగనంపడమే అయిన నేపథ్యంలో తన సోదరికి రాజకీయంగా ఎలాంటి బెరుకూ లేకుండా.. తన అనుభవాన్ని జోడించి.. పురందేశ్వరి రాజకీయ ప్రసంగాలపై ఆమెకు దిశానిర్దేశం చేస్తున్నారట. ఇదీ.. సంగతి!