టీడీపీలో టాప్ పోస్ట్ లో బ్రాహ్మణి... ?
తెలుగుదేశం పార్టీకి సరైన కాలంలో సరైన లీడర్ షిప్ గా నారా బ్రాహ్మణిని తీసుకుని వస్తున్నారు అంటున్నారు
By: Tupaki Desk | 18 Sep 2023 9:30 AM GMTతెలుగుదేశం పార్టీకి సరైన కాలంలో సరైన లీడర్ షిప్ గా నారా బ్రాహ్మణిని తీసుకుని వస్తున్నారు అంటున్నారు. ఆమెది నందమూరి బ్లడ్, నారా మెట్టినిల్లు. అలా ఆమె నారా నందమూరి వారసురాలుగా నూరు శాతం టీడీపీలో కీ రోల్ ప్లే చేయడానికి అర్హురాలుగా ముందుకు వస్తున్నారు అంటున్నారు.
ఇప్పటికే రాజమండ్రిలో మకాం వేసి తన అత్త భువనేశ్వరితో కలసి టీడీపీ నిరసనలలో ఆమె పాలు పంచుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ మీడియా ముందు తనదైన వాదన వినిపించారు. ఈ అరెస్ట్ వెనక వైసీపీ వ్యూహాలు ఏంటో కూడా విప్పి చెప్పారు. తన మామ చంద్రబాబు, భర్త నారా లోకేష్ చేస్తున్న పర్యటనలకు జనాల నుంచి ఆమోదం ఉండడంతోనే వైసీపీ భయపడి ఈ రకంగా వారిని కట్టడి చేసేందుకే అరెస్టులు చేసిందని ఆమె అన్నారు.
తన భర్త లోకేష్ ని అరెస్ట్ చేయవచ్చు అని ఫస్ట్ టైం బయటపెట్టింది కూడా ఆమె. అయినా తాము భయపడమని ఆమె డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తమకు ఏపీలోని అయిదు కోట్ల మంది ప్రజలంతా కుటుంబీకులే అని ఆమె ఒక ఎమోషనల్ టచింగ్ డైలాగ్ ని వదిలారు. ఇలా బ్రాహ్మణి మీడియా మీట్ ఆమె స్పీచ్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ధాటీగా మాట్లాడిన తీరు, ఆమె డేరింగ్ గా చెప్పిన మాటలు అన్నీ కూడా టీడీపీకి కొత్త జోష్ ని ఇస్తున్నాయి.
చంద్రబాబు లోకేష్ జైలు పాలు అయినా బ్రాహ్మణి పార్టీని లీడ్ చేయగలదు అనేలా ఆమె ఇస్తున్న భరోసాతో టీడీపీ పూర్తి ధీమాతో ఉంది. ఇదిలా ఉంటే బ్రాహ్మణిని వచ్చే ఎన్నికల ముందు స్టార్ కాంపెనియర్ గా రంగంలోకి దించుతారు అని ఇప్పటిదాకా ప్రచారం జరుగుతున్నదే. అయితే అది కాస్తా చాలా ముందు అయింది అంటున్నారు. ఆమె తాత ఎన్టీయార్ సీఎం ఆమె తండ్రి బాలయ్య ఎమ్మెల్యే, ఆమె మామ సీఎం, భర్త లోకేష్ మాజీ మంత్రి. ఇలా తన చుట్టూ తన వారంతా రాజకీయంగా ఉంటే బ్రాహ్మణి కూడా అదే బాటలో ధీటుగా ముందుకు అడుగులు వేస్తారనే అంటున్నారు.
ఆమెకి టీడీపీలో కీలక పదవిని కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు. ఎందుకంటే లోకేష్ ని ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు అని అంటున్నారు. ఆయన అరెస్ట్ అనివార్యం అని వైసీపీ మంత్రులు ఒక వైపు గట్టిగా చెబుతూంటే ఏపీసీఐడీ కూడా ఈ స్కిల్ కేసులో లోకేష్ ప్రమేయం సైతం ఉందని చెబుతోంది.
దాంతో వైసీపీ ప్లాన్ ఏంటో అర్ధం చేసుకున్న టీడీపీ అధినాయకత్వం బ్రాహ్మణికి కీలక పదవిని ఇచ్చి ముందు ఉంచాలని ఆమె సారధ్యంలో పార్టీని నడిపించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకు బెయిల్ ఆలస్యం అయినా లేక లోకేష్ జైలు పాలు అయినా లేక ఇద్దరూ బయట ఉన్నా కూడా బ్రాహ్మణి సేవలను ఇక మీదట పూర్తి స్థాయిలో పార్టీ వాడుకునేలా ఆమెకు గురుతర బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.
అదే జరిగితే కనుక టీడీపీకి మరింత ఊపు వస్తుందని అంటున్నారు. అటు నందమూరి వారసురాలిగా కూడా ఆమె ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫ్యామిలీకి అన్యాయం చేసినట్లుగా ఉండదని, మహిళా నేతగా ఆమె టీడీపీలో సరికొత్తగా దూసుకుకు వెళ్ళేందుకు వైసీపీని కట్టడి చేసేందుకు అవకాశాలు రెట్టింపు అవుతాయని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఏమి జరుగుతుందో.