ముసలాయన..బాబు హర్ట్ అవుతున్నారా..?
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఎక్కువ అయిపోయాయి. అవి కాస్తా ముందుకెళ్ళి వయసుని రూపాన్ని కూడా అవహేళన చేసే స్థాయిలో సాగుతున్నాయి.
By: Tupaki Desk | 22 July 2023 12:09 PM GMTరాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఎక్కువ అయిపోయాయి. అవి కాస్తా ముందుకెళ్ళి వయసుని రూపాన్ని కూడా అవహేళన చేసే స్థాయిలో సాగుతున్నాయి. నిన్నటికి నిన్న మహారాష్ట్రలో సొంత మేనమామ శరద్ పవార్ ని పట్టుకుని ఆయన మేనల్లుడు అజిత్ పవార్ ఒంటికి 83 ఏళ్లు వచ్చాయి ఇక హాయిగా రెస్ట్ తీసుకో అని సెటైర్లు వేశారు.
ఏపీలో చూసుకుంటే చంద్రబాబు ఏజ్ తో ముడిపెట్టి వైసీపీ రాజకీయం చేస్తూనే ఉంది. జగన్ అయితే డెబ్బై అయిదేళ్ల ముసలాయన అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. చంద్రబాబుది అర్ధ శతాబ్దం రాజకీయం. ఆయన తన మీద ఏ విమర్శ వచ్చినా ఎపుడూ పూర్తిగా పట్టించుకుని సెన్సిటివ్ అయ్యేటంత వారు కాదని చరిత్ర చెబుతోంది.
అయితే బాబు గత కొంతకాలంగా ఎమోషన్ అవుతున్నారు. ప్రతీ దానికీ ఆయన సున్నితంగానే ఆలోచిస్తూ మధన పడుతున్నారు అని అంటున్నారు. తన భార్య మీద లేని పోని ఆరోపణలు చేశారని మీడియా ముందు రెండేళ్ల క్రితం చంద్రబాబు బోరున ఏడ్చిన విషయం అప్పటికీ ఇప్పటికీ కూడా సంచలనమే. మరో వైపు చూస్తే చంద్రబాబును ముసలాయన అంటూ జగన్ చేస్తున్న ర్యాగింగ్ కి చంద్రబాబు హర్ట్ అవుతున్నారా అన్నది చర్చకు వస్తోంది.
నిజానికి జగన్ ఈ మాటను ఎందుకు పదే పదే అంటున్నారంటే దాని వెనక కూడా రాజకీయ వ్యూహం ఉంది అని అంటున్నారు. బాబు వయసు అయిపోయిందని, ఆయనతో ఏపీ రాజకీయం టీడీపీ రాజకీయం ఇక నడవదు సాగదని చెప్పేందుకే అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే చంద్రబాబుని అవుట్ డేటెడ్ పొలిటీషియన్ గా కూడా వైసీపీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది.
ఈ రెండూ కూడా టీడీపీని ఇపుడు తెగ ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో చూస్తే యువతరమే ముందు ఉంది. జగన్ ఒక వైపు ఉంటే పవన్ మరో వైపు ఉన్నారు. యూత్ కూడా అటూ ఇటూ ఉన్నారు. టీడీపీని గ్రాండ్ ఓల్డ్ ప్రాంతీయ పార్టీగానే చూస్తున్నారు. ఈ నేపధ్యంలో తన అనుభవం చెప్పి అభివృద్ధి మంత్రంతో 2024లో బాబు అధికారంలోకి రావడం అన్నది కొంత టఫ్ జాబ్ గానే ఉంటుంది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే మారుతున్న ప్రజనీకం ఆలోచనలు, రాజకీయాల్లోకి ప్రతీ అయిదేళ్ళకు వచ్చి చేరుతున్న నవ యువ తరం ఓటర్లు వారి అభిరుచులు తరాల మధ్య అంతరాలు ఇవన్నీ కూడా టీడీపీకి ట్రబుల్ గా మారే అంశాలు అని అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ అధినేతను పట్టుకుని ముసలాయన అని వైసీపీ అధినాయత్వం పదే పదే అనడం వెనక పెద్ద రాజకీయమే ఉందని అంటున్నారు.
దీన్ని తిప్పు కొట్టే ప్రయత్నం అయితే టీడీపీ నుంచి చాలా మంది చేస్తూ వచ్చారు. స్వయంగా బాబు కొడుకు లోకేష్ కూడా ఒక సందర్భంలో చంద్రబాబు ముసలాయన అయితే ఆయనతో పోటీ పడి తిరుపతి కొండ మెట్లు జగన్ ఎక్కగలరా అని సవాల్ చేసారు. వర్ల రామయ్య కూడా బాబు వయసు ఒక టెక్నికల్ నంబర్ అని ఈ రోజుకీ ఆయనలా జిల్లాల టూర్లు జగన్ సహా ఎవరూ చేయలేరని మరో సందర్భంలో అన్నారు.
ఇపుడు కాంగ్రెస్ బీజేపీల నుంచి వచ్చి టీడీపీలో తన పాత్రను గట్టి పరచుకునే ప్రయత్నంలో ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ వంతు అని అంటున్నారు. ఆయన ఏకంగా టీడీపీ సెంట్రల్ ఆఫీసులో మీటింగ్ పెట్టి మరీ బాబుని పట్టుకుని ముసలాయన అనడం జగన్ కి తగదని అన్నారు. అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ జగన్ సాటి రారు అని కితాబు ఇచ్చేశారు.
మొత్తం మీద చూస్తే ముసలాయన అన్నది జగన్ వ్యూహం ప్రకారమే వాడుతున్నారు. దాంతో అటు టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఒక పార్టీ ఓల్డ్ అని ఆ నాయకత్వం అవుట్ డేటెడ్ అని కానీ ఒక్కసారిగా జనాల్లోకి వెళ్తే అది నెగిటివ్ రిజల్స్ట్ ని ఇస్తుంది. ఆ సంగతి తెలిసే వైసీపీ ఆయుధంగా బాబు ఏజ్ ని వాడుతోంది అని అంటున్నారు. గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం టీడీపీ చేస్తోంది మరి జనాలు ఈ రెండు వాదనలలో దేన్ని నమ్ముతారు అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు.