రాజకీయ కక్షతోనే అరెస్టు: బాబు
రాజకీయ కక్షతోనే తనను అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. స్కిల్ స్కామ్ తో తనకెలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.
By: Tupaki Desk | 10 Sep 2023 7:02 AM GMTరాజకీయ కక్షతోనే తనను అరెస్టు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. స్కిల్ స్కామ్ తో తనకెలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. తన అరెస్టు అక్రమమని, దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన తెలిపారు. విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో భాగంగా శనివారం ఉదయం చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో బాబును ప్రవేశపెట్టారు. కోర్టులో తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని బాబు కోరగా.. న్యాయమూర్తి అనుమతినిచ్చారు. దీంతో బాబు తన వాదనలు వినిపించారు.
రాజకీయ కక్షతోనే తనను అరెస్టు చేశారని ఈ సందర్భంగా బాబు పేర్కొన్నారు. స్కిల్ స్కామ్తో తనకెలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. తన అరెస్టు అక్రమమని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని బాబు వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ను 2015- 16 బడ్జెట్లో పొందుపరిచామని, రాష్ట్ర అసెంబ్లీ దీన్ని ఆమోదించిందని బాబు చెప్పారు. 2021 డిసెంబర్ 9 నాటి ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని, అప్పటి రిమాండ్ రిపోర్ట్ లో తన పాత్ర ఉందని సీఐబీ పేర్కొనలేదని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు.
రాష్ట్రంలో పూర్తిగా కక్ష సాధింపు పాలన కొనసాగుతుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలపై అధికార జులుం ప్రదర్శిస్తున్నారని బాబు అన్నారు. రాష్ట్రంలో పౌర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోందని, గవర్నర్ అనుమతి లేకుండానే తనను అరెస్టు చేశారని బాబు కోర్టుకు తెలిపారు. చంద్రబాబు వాదనలను న్యాయస్థానంలో రికార్డు చేశారు.