Begin typing your search above and press return to search.

బాబు అరెస్ట్ వెనక అసలు పెద్దలు ...?

చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాజకీయాలలోనే కాదు దేశ రాజకీయాలలోనూ సంచలనం రేపుతోంది.

By:  Tupaki Desk   |   10 Sep 2023 11:31 AM GMT
బాబు అరెస్ట్ వెనక అసలు పెద్దలు ...?
X

చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాజకీయాలలోనే కాదు దేశ రాజకీయాలలోనూ సంచలనం రేపుతోంది. అయితే కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం అసలు ఆ విషయం ఏమీ తెలియనట్లుగా మౌనం వహిస్తున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటు పురంధేశ్వరి అయితే బాబు అరెస్ట్ అక్రమమని గట్టిగానే చెప్పారు. కానీ అది చాలదు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆ మాట అంటే అపుడు బాబు అరెస్ట్ విషయంలో ఒక లెక్క తేలుతుంది.

కానీ అలా జరగలేదు. రెండు రోజులు గడచిపోయినా ఢిల్లీ నుంచి అసలు ఆ సౌండే లేదు. ఆ మాటకు వస్తే బాబు అరెస్ట్ సంగతి ముందుగా ఢిల్లీ పెద్దలకు తెలిసే జరిగిందా అన్న డౌట్లు ఇపుడు టీడీపీ వారితో పాటు చాలా మందికి ఉన్నాయి.

అయితే అదే నిజం అని బల్ల గుద్దుతున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. తాను చాలెంజి కూడా చేస్తాను అని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు ప్రధాని మోడీ, అమిత్ షాలకు తెలియకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి బలమైన నేత అరెస్ట్ జరగనే జరగదు అని నారాయణ అంటున్నారు.

ఈ విషయంలో కేంద్ర పెద్దలకు ముందుగా సమాచారం ఇచ్చి మరీ బాబుని అరెస్ట్ చేశారని, ఇది పక్కా వ్యూహమని సీపీఐ నారాయణ అంటున్నారు. ఈ విషయాన్ని బాబు తెలుసుకోవాలని ఆయన హితబోధ చేస్తున్నారు. అసలు రాజకీయం అంటే ఏంటో కూడా బాబు తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.

తనను కాపాడేందుకు బీజేపీ నేతలు వస్తారని, అండగా ఉంటారని బాబు భ్రమలలో ఉన్నారంటూ సీపీఐ నారాయణ అంటున్నారు. కానీ అది జరిగే పని కాదని తేలిపోయిందని ఇక కళ్ళు తెరవాల్సింది చంద్రబాబే అని ఆయన అంటున్నారు. తన అరెస్ట్ వెనక ఎవరు ఉన్నారు అన్నది బాబు ఒక్కసారి ఆలోచించాలని కూడా నారాయణ కోరుతున్నారు.

అమిత్ షా ఒక్క మాట చెబితే చాలు ఏపీ సర్కార్ ఇంత చేస్తుందని తాను అనుకోవడంలేదని ఆయన అంటున్నారు. అమిత్ షా అనుమతి తీసుకునే జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేశారని కూడా తనకు తెలిసిన గుట్టుని విప్పి చెప్పారు సీపీఐ నారాయణ. బీజేపీ హస్తం లేకుండా బాబుని అరెస్ట్ చేయడం అన్నది అసలు ఎవరికీ సాధ్యం కాదని కూడా ఆయన అంటున్నారు.

మొత్తం మీద చూస్తే బాబుని బీజేపీ వైపు నుంచి బయటకు రమ్మని నారాయణ కోరుతున్నారు అనిపిస్తోంది. అయితే బీజేపీతో దోస్తీ కోరుతూ ఆ పార్టీకి అనుకూలంగా ఉంటేనే బాబుని అరెస్ట్ చేశారు, పరిస్థితి ఇలా ఉంది, అలాంటిది బాబు కనుక ఒక్కసారి కేంద్రంలోని బీజేపీ పెద్దలను ఎదిరించి వ్యతిరేక రాజకీయం మొదలెడితే అపుడు సీన్ ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు అన్న విశ్లేషణలూ ఉన్నాయి. చంద్రబాబుకు ఈ విషయాలు తెలియనివా అని కూడా అంటున్నారు.

ఆయన మూడు సార్లు సీఎం గా చేశారు. ఆయన హయాంలో చాలా స్కాంలు జరిగాయని బీజేపీ కూడా అంటూ వచ్చింది. మరి బాబు బీజేపీ వైపు కాకుండా వేరే వైపు వెళ్లే ఇంకా గట్టిగానే బిగించే చాన్స్ ఉంటుందని అన్న వారూ ఉననరు. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయ పార్టీలు తలోరకంగా విశ్లేషణలు చేసుకుంటూ వస్తున్నాయి. ఏది నిజం, ఏది ఊహ అన్నది తెలియదు కానీ తాను నిప్పుని అని పదే పదే చెప్పుకునే బాబు అరెస్ట్ మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం అన్నది తేలిపోయింది.