Begin typing your search above and press return to search.

బాబు జీవితంలో గుర్తుండే రోజు!

టీడీపీ అధినేత, జాతీయ నాయకుడుగా పేరున్న నేత. సీనియర్ మోస్ట్ లీడర్. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర.

By:  Tupaki Desk   |   10 Sep 2023 5:55 PM GMT
బాబు జీవితంలో గుర్తుండే రోజు!
X

టీడీపీ అధినేత, జాతీయ నాయకుడుగా పేరున్న నేత. సీనియర్ మోస్ట్ లీడర్. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర. ముమ్మారు సీఎం గా పనిచేసిన వ్యక్తి. అలాంటి బాబు పెళ్ళి రోజు అంటే ఎక్కడ జరుపుకోవాలి. ఆయన లాంట్ వీఐపీ లీడర్ మ్యారేజ్ డే అంటే ఎలా ఉండాలి.

కానీ చంద్రబాబు పెళ్ళి రోజు కోర్టు అవరణలోనే జరిగిపోయింది. నిజంగా ఆ ముచ్చట జరుపుకునే సంతోషం కూడా ఆయనకు లేకుండా ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుని రాజమండ్రి జైలుకు రిమాండ్ కి తరలిస్తున్న నేపధ్యంలో కోర్టు ఆవరణలో సతీమణి భువనేశ్వరి కలిశారు. కొద్ది సేపు ఆమె బాబుతో మాట్లాడేందుకు పోలీసులు అనుమతించారు.

ఇదిలా ఉండగా చంద్రబాబుకు ఎన్టీయార్ మూడవ కుమార్తె భువనేశ్వరితో 1981 సెప్టెంబర్ 10న మద్రాస్ లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటికి చంద్రబాబు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆ శాఖ ద్వారానే ఆయన సినిమా పరిశ్రమకు దగ్గర అయ్యారు.

అలా ఎన్టీయార్ పెద్ద కుమారుడు నందమూరి జయక్రిష్ణ తో బాబుకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా తరువాత రోజులలో నందమూరి వారి అల్లుడిగా మారేందుకు ఆస్కారం ఏర్పడింది. చంద్రబాబు వివాహం అయిన పద్నాలుగేళ్ల తరువాత అంటే 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. కేవలం పద్నాలుగేళ్లలో ఒక సాధారణ కాంగ్రెస్ మంత్రి అప్పటి అంజయ్య ప్రభుత్వంలో డెబ్బై అయిదు మందికి పైగా మంత్రులతో జెంబోజెట్ క్యాబినెట్లో ఒకరిగా ఉన్న చంద్రబాబు సీఎం అయ్యారు అంటే అది ఎంటీయార్ అల్లుడు కావడం వల్లనే అంటారు.

అంతటి బలమైన రాజకీయ జీవితాన్ని ఇచ్చినది బాబు వివాహ బంధం.అందువల్ల ఆయన పెళ్ళి రోజుకు ఎంతో విశిష్టత ఉంది. ఆయనకు సెప్టెంబర్ నెల చాలా ప్రీతిపాత్రమైనది. ఎంతో కలసి వచ్చినది కూడా ఒక సెప్టెంబర్ ఎన్టీయార్ అల్లుడిని చేస్తే మరో సెప్టెంబర్ ఏకంగా ఏపీకి సీఎం ని చేసింది. కానీ 2023 సెప్టెంబర్ 10 మాత్రం చంద్రబాబు మొత్తం జీవితంలోనే ఒక పీడకలగా మారింది అని చెప్పాలి. ఆయన కలలో కూడా అనుకోని విధంగా జైలుకు పంపిన ఈ తేడీ ఆయన పెళ్లి రోజుతో ముడిపడి ఉండడం రాజకీయ విషాదం. విధి అంటే ఇదేనేమో అని అంతా అంటున్న పరిస్థితి.