Begin typing your search above and press return to search.

ప్రాజెక్టుల వెంట బాబు పరుగులు... ఆ ముద్ర పోతుందా...?

ఈ క్రమంలో ఈ నదులను కాపడుకోవడానికి ఈ నదీ జనాలు ఉప్పు నీటిలో అంటే సాగరంలో కలవకుండా ప్రాజెక్టులు నిర్మించి వాటి ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   30 July 2023 8:31 AM GMT
ప్రాజెక్టుల వెంట బాబు పరుగులు... ఆ ముద్ర పోతుందా...?
X

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఒక బలమైన ముద్ర ప్రత్యర్ధి పార్టీలు దశాబ్దాల క్రితమే వేసి పారేశాయి. ఆయన రైతు వ్యతిరేకి అని ఒకటికి పది మార్లు చెప్పి జనాలనూ ఒప్పించేశారు. 2004కు ముందు జరిగిన సంఘటనలూ కొంత దానికి దోహదపడ్డాయి. ఉచిత విద్యుత్ మీద ఆనాడు బాబు చేసిన కామెంట్స్ రైతులకు దూరం అయ్యేలా చేశాయి.

ఉచిత విద్యుత్ ఇస్తూ పోతే కరెంట్ తీగల మీద బట్టలారేసుకోవడమే చివరికి మిగిలేది అని నాడు బాబు వ్యాఖ్యానించారని ప్రచారంలో ఉన్న మాట. దాన్ని పట్టుకుని కూడా నాటి కాంగ్రెస్ నుంచి నేటి వైఎస్సార్ కాంగ్రెస్ వరకూ అంతా అదే మాట పట్టుకుని ఈ రోజుకూ విమర్శలు చేస్తారు. మరో సందర్భంలో వ్యవసాయం దండుగ అని బాబు అన్నారని కూడా ప్రచారం జరిగింది. అలా అనలేదు అని టీడీపీ ఎంతగా వివరణ ఇచ్చినా అది కూడా విపక్షాలకు ఆయుధం అయిపోయింది.

ఇంకో వైపు చంద్రబాబు పాలనలో కరవు వస్తుందని ఆయన ఉంటే సుభిక్షం కాదని దుర్భిక్షం అని కూడా వైసీపీ విమర్శలు చేస్తుంది. ఇవన్నీ ఎలా ఉన్నా చంద్రబాబును మాత్రం రైతు వ్యతిరేకిగా చిత్రీకరించడంలో విపక్షాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. బాబు దాన్ని ఎంతగా మాపుకుందామన్నా కుదరలేదు. 2014లో రైతు రుణ మాఫీ అని ఆయన భారీ హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో అమలు చేయలేక చతికిల పడ్డారు.

దాని వల్ల కూడా మళ్లీ వ్యతిరేకత వచ్చింది. అలా వైసీపీ నేతలు పెంచారు. ఇపుడు చూస్తే బాబుకు అన్ని వర్గాలు కావాల్సి ఉంది. ముఖ్యంగా రైతులను మంచి చేసుకుని వారికి పార్టీని చేరువ చేయాలన్న ప్రయత్నంలో భాగనే ప్రాజెక్టుల వెంట బాబు పరుగులు అని అంటున్నారు.

దానికి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని టీడీపీ తీసుకుంది. పెన్నా టూ వంశధార. పెన్నా రాయలసీమలో ఉంది. వంశధార శ్రీకాకుళంలో ఉంది. ఏపీలో గోదావరి క్రిష్ణ, వంశధార, నాగావళి, పెన్నా వంటి జీవ నదులతో పాటు మరో అతి ముఖ్యమైన 68 దాకా నదులు ఉన్నాయి. ఈ నదులు అన్నీ కూడా ఏపీలో వ్యవసాయానికి ఎంతో సాయం చేస్తున్నాయి ప్రజల సాగు తాగు నీటి కష్టాలను తీరుస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ నదులను కాపడుకోవడానికి ఈ నదీ జనాలు ఉప్పు నీటిలో అంటే సాగరంలో కలవకుండా ప్రాజెక్టులు నిర్మించి వాటి ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి. దానికి ఎన్నో పార్టీలు ప్రభుత్వాలు కూడా తమ వంతుగా చేస్తూ వచ్చాయి. వైఎస్సార్ పోలవరానికి అన్ని అనుమతులూ తెచ్చారు. అయితే ఇపుడు విభజన ఏపీలో దాని అతీ గతీ అర్ధం కావడం లేదు

అలాగే వంశధార మీద ప్రాజెక్టుల విషయం అలాగే ఉంది. క్రిష్ణా నది నీటి వినియోగం విషయంలో కూడా ఏపీకి ఉన్న హక్కులు ఎంత ఎలా వాడుకోవాలి అన్న దాని మీద కూడా వైసీపీ పాలకులకు అవగాహన లేదని చంద్రబాబు ఘాటైన విమర్శలు చేశారు.

చంద్రబాబు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఏపీలో ప్రాజెక్టుల తీరు మీద ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇపుడు ఆయన స్వయంగా ప్రాజెక్టుల సందర్శన పేరుతో ఏపీ అంతా తిరగనున్నారు. ఆగస్ట్ 1న ఆయన పెన్నా నదీ పరివాహిక ప్రాంతాలలో టూర్ చేస్తారు. అలా ఆగస్ట్ రెండవ వారం నాటికి వంశధార ప్రాంతానికి చేరుకుంటారు. ఇలా బాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ద్వారా బహుళ ప్రయోజనాలను ఆశిస్తున్నారు.

తాము రైతులకు ఎంత చేశామన్నది ఒక వైపు వివరిస్తూనే మరో వైపు వైసీపీ ప్రభుత్వం గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో సాగు నీటి ప్రాజెక్టుల కోసం ఎంత ఖర్చు చేసింది అని నిలదీస్తారు. పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడతారు. తమది రైతు అనుకూల పార్టీ అని చెప్పుకొస్తారు. తన మీద బలంగా పడిన రైతు వ్యతిరేక ముద్ర చెరిపేసుకోవడంతో పాటు వైసీపీ మీద రైతాంగానికి వ్యతిరేకతను పెంచాలన్నదే బాబు మార్క్ ఆలోచన. మరి దీన్ని ధీటుగా వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.