పుంగనూరులో హైటెన్షన్.. చంద్రబాబు పర్యటన ఉద్రిక్తం.. గాలిలోకి పోలీసుల కాల్పులు
By: Tupaki Desk | 4 Aug 2023 1:32 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ వర్సెస్ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఇది.. పోలీసుల వరకు కూడా చేరింది. దీంతో పోలీసు లపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదేసమయంలో కార్యకర్తలు విసిరిన రాళ్ల దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
అసలు వివాదం ఏంటి?
సీమ డిక్టరేషన్ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న విష యం తెలిసిందే. ఈ నెల 1 నుంచి ఆయన నాలుగు రోజుల పాటు షెడ్యూల్ పెట్టుకున్నారు. ఇప్పటికే కర్నూలు, కడపలో పర్యటించారు. ఇక్కడ నుంచి శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్య టించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన కడప శివారు.. అంగళ్లు నుంచి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం లోకి చంద్రబాబు ప్రవేశించాల్సి ఉంది.
అదేవిధంగా పుంగనూరు పట్టణంలో చంద్రబాబు రోడ్ షో.. అనంతరం సభకు కూడా షెడ్యూల్ ప్రకటించా రు. కానీ, పోలీసులు మాత్రం చంద్రబాబు రోడ్ షో.. సభలకు అనుమతి లేదంటూ.. పోలీసులు అడ్డుకు న్నారు. ఆయన వస్తున్న దారిలో బారికేడ్లు పెట్టి.. అనుమతి లేదని చెప్పారు. దీంతో పోలీసులతో టీడీపీ కార్యకర్తలు.. నాయకులకు వాగ్వాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు.
ఇది కాస్తా ఉద్రిక్తతలకు దారితీసింది. తమపై లాఠీచార్జికి దిగిన పోలీసులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. ఇష్టానుసారంగా రాళ్లను విసిరేరారు. ఇంతలో టీడీపీ కార్యకర్తలకు వైసీపీ కార్యకర్తలకు మధ్య కూడా వివాదం రేగింది. ఈ క్రమంలో పోలీసుల వాహనాలకు నిప్పంటించారు. అదేవిధంగా.. రాళ్లదాడి కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులకు తీవ్రంగా గాయలయ్యాయి. అలాగే పలువురు కార్యకర్తలు కూడా గాయపడ్డారు.
ఇక, ఈ ఘటనతో పోలీసులు.. పరుగులు పెట్టిన వీడియో లు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పుంగనూరు నియోజకవర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. ఈ ఘటనపై చంద్రబాబు స్పందిస్తూ.. ``బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా?`` అని వ్యాఖ్యానించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారని అన్నారు.