కుప్పంపై బాబుకు పట్టు చిక్కడం లేదా?
తన సొంత నియోజకవర్గం కుప్పంలో అధికార వైసీపీ జోరును అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయనకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం.
By: Tupaki Desk | 6 Aug 2023 1:30 PM GMTతన సొంత నియోజకవర్గం కుప్పంలో అధికార వైసీపీ జోరును అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయనకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం. 1983 నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీకి తిరుగులేదు. 1989 నుంచి అయితే వరుసగా చంద్రబాబే గెలుస్తున్నారు. టీడీపీ కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో బాబును ఓడించి, ఆ పార్టీని మానసికంగా దెబ్బకొట్టాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రణాళికలు అమలు చేస్తోంది.
ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్, ఎంపీటీసీ, జిల్లా పరిషత్‌తో పాటు కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ సొంతం చేసుకుంది. ఒక్కో స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తూ బాబును దెబ్బకొట్టే దిశగా సాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటమికి బాధ్యతగా చంద్రబాబు పీఏ మనోహర్ ఆ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
మనోహర్ వెళ్లిపోయిన తర్వాత కుప్పం బాధ్యతల కోసం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను బాబు నియమించారు. కానీ శ్రీకాంత్‌కు ఇక్కడ సొంత పార్టీ నాయకుల నుంచే అసంతృప్తి ఎదురవుతోంది. ఈ ప్రాంతంతో సంబంధం లేని నాయకుడిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. రాయలసీమ తూర్పు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన శ్రీకాంత్‌ది ప్రకాశం జిల్లా. రాజకీయాల్లోనూ సుదీర్ఘ అనుభవం లేదు. కానీ రాయలసీమలో గెలిచారనే కారణంతో బాబు కుప్పం బాధ్యతలు ఆయనకు అప్పగించారు. కానీ ఇక్కడ టీడీపీ బలోపేతం కోసం శ్రీకాంత్ ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం లేదని తెలిసింది.