బాబుకు తెలంగాణా మీద ప్రేమ లేదు కానీ.... పాజిటివ్ రియాక్షన్...!
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అని చెప్పినా మరేమి చెప్పినా తెలంగాణాలో మాత్రం టీడీపీ పెద్దగా ఏమీ లేకుండా పోయింది.
By: Tupaki Desk | 10 Aug 2023 1:30 AM GMTతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అని చెప్పినా మరేమి చెప్పినా తెలంగాణాలో మాత్రం టీడీపీ పెద్దగా ఏమీ లేకుండా పోయింది. ఇక ఉన్నదంతా ఏపీలోనే. 2024 ఎన్నికలు చావో రేవో లాంటివి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు చంద్రబాబు ఇపుడు తెలంగాణా మీద పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. దానికి కారణం ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని చిన్న గీత గీసి తగ్గించాలంటే తెలంగాణాతో పోలిక పెట్టాలని అంటున్నారు.
అయితే అవే తమకు దీవెనలు వరాలు అంటున్నారు తెలంగాణా బీయారెస్ నేతలు. బాబు ఎందుకు తెలంగాణాను పొగిడారో కానీ దానిని క్రెడిట్ గా బీయారెస్ అయితే తీసుకుంటోంది. బాబు ఒకసారి అంటే పది సార్లు అదే మాటను ప్రచారం చేసుకుంటోంది. నిన్నటిని నిన్న నిండు అసెంబ్లీలో కేటీయార్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణా ప్రభుత్వాన్ని పొగుడుతున్నారని ఇక్కడ ఒక ఎకరం అమ్మితే ఏపీలో యాభై ఎకరాలు కొనుక్కోవచ్చు అని చెబుతున్నారని చెప్పుకున్నారు.
ఇపుడు మరో మంత్రి హరీష్ రావు వంతు. ఆయన సిద్దిపేటలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణా అభివృద్ధి మీద బాబు మెచ్చుకోలుగా మాట్లాడారని ఇది పాజిటివ్ రియాక్షన్ అని అన్నారు. నిజానికి బాబుకు తెలంగాణా మీద ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ లేదని ఒక వైపు విమర్శిస్తూనే అటువంటి బాబు కూడా పొగిడారు అంటె బీయారెస్ పాలన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు అని అన్నారు.
మరో వైపు చూస్తే విద్యకు తెలంగాణా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది అని హరీష్ రావు అన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రంగా నిధులను కేటాయించేవి అంటూ టీడీపీ కాంగ్రెస్ లను విమర్శించారు. ఒకప్పుడు పంజాబ్ వరి ఉత్పత్తిలో నంబర్ వన్ గా ఉంటే ఇపుడు ఆ ప్లేస్ లోకి తెలంగాణా వచ్చిందని అన్నారు. అలాగే డాక్టర్ల తయారీ కేంద్రంగా తెలంగాణా మారిందని గుర్తు చేశారు.
మొత్తం మీద చూసుకుంటే తాము పనిచేసేది ఎక్కువని, ప్రచారం మాత్రం లేదని హరీష్ రావు చెబుతూనే తమదే మంచి ప్రభుత్వం అని చెప్పాల్సింది చెప్పేసారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి దీవించాలని ఆయన జనాలను కోరారు. ఇదిలా ఉంటే బాబు ఏ ముహూర్తాన ఏపీలో భూముల ధరలు పడిపోయాయి అభివృద్ధి లేదు అన్నారో కానీ దాన్ని పదే పదే తమ క్రెడిట్ గా తెలంగాణా ప్రభుత్వం చెప్పుకుంటోంది.
అదే సమయంలో బాబుకు తెలంగాణా మీద ప్రేమ లేదని అలాంటి మనిషే ఇలా నిజాలు చెప్పారంటే మా పనితనం చూడండి అని బాబుని విలన్ గానే చూపిస్తూ తమ ప్రచారాన్ని మాత్రం ఆయన మాటలనే తీసుకుని చేసుకుంటోంది. దీంతో వారెవ్వా బీయారెస్ రాజకీయ తెలివిడి అని అంటున్నారు.
ఎందుకంటే బాబుని తెలంగాణాకు పాజిటివ్ గా చూపిస్తే అక్కడ ఆయన పార్టీ ఉంది. రేపటి రోజున పొత్తులతో ఆయన వచ్చినా ఎంతో కొంత ప్రభావం చూపించకూడదు అన్న ముందస్తు వ్యూహాలతోనే బాబు తీయని పొగడ్తలు కావాలి కానీ ఆయనను మాత్రం తెలంగాణా ప్రజల వ్యతిరేకిగానే చూపిస్తున్నారు అని అంటున్నారు.