దసరాకు మొదటి లిస్టు ఖాయమా ?
తమ్ముళ్ళ పనితీరుపై చంద్రబాబు నాయుడు చేయించుకుంటున్న సర్వే నివేదికలు అందాయట.
By: Tupaki Desk | 15 Aug 2023 6:04 AM GMTతమ్ముళ్ళ పనితీరుపై చంద్రబాబు నాయుడు చేయించుకుంటున్న సర్వే నివేదికలు అందాయట. చంద్రబాబు రెండు రకాల సర్వేలు చేయించుకుంటున్నారు. మొదటిదేమో వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం నియోజకవర్గాల్లో తిరుగుతు చేస్తున్న సర్వే. ఇక రెండోదేమో పార్టీలో తనకు అత్యంత నమ్మకస్తులతో అధినేత చేయించుకుంటున్న సర్వే. తాజాగా రెండు సర్వే రిపోర్టులు చంద్రబాబు చేతికి అందినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత అధినేత హైదరాబాద్ చేరుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఈరోజు 2047 విజన్ డాక్యుమెంట్ పేరుతో వైజాగ్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మొదలయ్యే 2 కిలోమీటర్ల వాకథాన్ ప్రోగ్రామ్ కు చంద్రబాబే ముఖ్య అతిథి. ఈ కార్యక్రమం తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అప్పుడు తనకు అందిన సర్వే నివేదికలపై అధ్యయనం మొదలుపెడతారని సమాచారం. రెండు రిపోర్టుల్లో వచ్చిన వివరాల ఆధారంగా తమ్ముళ్ళని పిలిపించి వ్యక్తిగతంగా సమీక్షలు చేయబోతున్నారు.
అవసరమైన వాళ్ళకి క్లాసులు పీకుతు, బాగా పనిచేస్తున్న వారిని అభినందిస్తూనే అభ్యర్ధులను ఫైనల్ చేయబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాబోయే దసరా పండుగ నాటికి మొదటి జాబితాను ఫైనల్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. సిట్టింగుల్లో టికెట్లు ఇవ్వదలచుకున్న వాళ్ళకి, కాంట్రవర్సీ లేని నియోజకవర్గాలతో మొదటి జాబితా తయారుచేయబోతున్నారట. అంటే 175 నియోజకవర్గాల్లో మొదటి జాబితా అంటే సుమారుగా 50 నియోజకవర్గాలు ఉండవచ్చని తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు.
మొత్తం 175 నియోజకవర్గాలపైనా సర్వే రిపోర్టులు అందినప్పటికీ జనసేనతో పొత్తు విషయం ఇంకా ఏమీ తేలలేదు. పొత్తుంటే ఒకపద్దతి పొత్తు లేదంటే మరోపద్దతిగా ఉంటుందని అందరికీ తెలిసిందే. పొత్తుంటే జనసేనకు ఎన్నిసీట్లు ఇవ్వాల్సుంటుందనే విషయంలో క్లారిటి రావటంలేదు. అయితే అందుబాటులోని సమాచారం ప్రకారం కనీసం 40 సీట్లు వదులుకోక తప్పదనే చర్చ నడుస్తోంది. 40 సీట్లు వదులుకోవటం అంటే అంతమంది తమ్ముళ్ళకు పోటీచేసే అవకాశాలు పోయినట్లే. అందుకనే అసలు జనసేనతో పొత్తు వద్దనే వద్దని తమ్ముళ్ళు చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నారు. అందుకనే దసరా పండుగలోపే పొత్తు విషయాన్ని కూడా ఫైనల్ చేసేయాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లు సమాచారం. చివరకు ఏమవుతుందో ఏమో చూడాలి.