కీలక నియోజకవర్గంలో అభ్యర్థి ప్రకటనకు ఇన్ని మీనమేషాలా?
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో టీడీపీ ఉంది.
By: Tupaki Desk | 3 Sep 2023 1:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో టీడీపీ ఉంది. ముఖ్యంగా టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాలో అత్యధిక సీట్లను కొల్లగొట్టాలనే ప్లాన్ లో ఉంది. అందులోనూ ఇదే జిల్లాలో గుడివాడ, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని గట్టి లక్ష్యమే నిర్దేశించుకుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల గన్నవరానికి యార్లగడ్డ వెంకట్రావును ఇంచార్జిగా నియమించారు. ఇక గుడివాడలో మాత్రం ఇంతవరకు ఇంచార్జిని నియమించలేదు. ప్రస్తుతం గుడివాడలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, వెనిగళ్ల రాము టీడీపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ గుడివాడ టీడీపీ టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే చంద్రబాబు ఇంతవరకు ఎవరినీ ఫైనల్ చేయలేదు.
తాజాగా చంద్రబాబు గుడివాడ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు. దీనికి ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గ ఇంచార్జి రావి వెంకటేశ్వరరావుతోపాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుడివాడలో పార్టీ పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. త్వరలో గుడివాడకు అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
అయితే టీడీపీ మండల అధ్యక్షులు మాత్రం రావి వెంకటేశ్వరరావుకే సీటు ఇవ్వాలని వారంతా కోరారు. గతంలోనూ ఆయనకు అన్యాయమే జరిగిందని చంద్రబాబుకు గుర్తు చేశారు. దీంతో చంద్రబాబు సైతం రావికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని.. ఆయనకు న్యాయం చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఎన్నారై వెనిగళ్ల రాము కూడా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఆయన భార్య దళిత సామాజికవర్గానికి చెందినవారు. గుడివాడలో దళితులు, కాపులు, బీసీ ఓటర్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో తనకు సీటు ఇస్తే దళితుల ఓట్లు కూడా తనకే లభిస్తాయని ఆయన చెబుతున్నట్టు తెలుస్తోంది.
కాగా గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున 2004, 2009ల్లో గెలుపొందిన కొడాలి నాని 2014, 2019ల్లో వైసీపీ తరఫున విజయం సాధించారు. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ లపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసేవారిలో కొడాలి నాని ముందుంటున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఓడించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో గట్టి అభ్యర్థిని నిలబెట్టే క్రమంలో తీవ్ర మేథోమథనం చేస్తున్నారు. అతి త్వరలోనే గుడివాడలో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తామని చెబుతున్నారు.
అయితే ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయం కూడా లేదు. ముందస్తు ఎన్నికలు వస్తాయని టాక్ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంతవరకు టీడీపీ అభ్యర్థిని గుడివాడలో ప్రకటించకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు నిరాశను వ్యక్తం చేస్తున్నాయని తెలుస్తోంది. ఇలా అయితే గెలుపు సులువు ఎలా అవుతుందని అంతర్మథనం చెందుతున్నట్టు సమాచారం.