Begin typing your search above and press return to search.

ఏంటి బాబుగారూ...ఈ తడబాట్లూ...పొరపాట్లూ...?

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల మాట్లాడుతున్న మాటలలో తడబాట్లూ పొరపాట్లు ఎందుకో అలా దొర్లేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   3 Sep 2023 4:17 AM GMT
ఏంటి బాబుగారూ...ఈ  తడబాట్లూ...పొరపాట్లూ...?
X

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల మాట్లాడుతున్న మాటలలో తడబాట్లూ పొరపాట్లు ఎందుకో అలా దొర్లేస్తున్నాయి. ఒక విధంగా వత్తిడిలో కూడా అలాంటివి జరగవచ్చు. అయితే సోషల్ మీడియా కాలంలో టెక్నాలజీ బలంగా ఉన్న రోజులలో ఇవన్నీ కూడా ఫుల్ గా రికార్డు అవుతాయి. ఎప్పటికీ అవి మారుమోగుతూనే ఉంటాయి. ప్రత్యర్ధులకు ఎపుడు అవసరం అనుకుంటే అపుడు వీటిని మళ్లీ మళ్లీ మోగించే వీలు కూడా ఉంది.

అయినా కూడా బాబు గారు ఎందుకో తడబాటుతో దొరికిపోతున్నారు. తాజాగా ఆయన పార్టీ క్యాడర్ మీటింగులో మాట్లాడుతూ పోలవరాన్ని తెచ్చి రాష్ట్రానికి రాజధానిని చేసేశారు. ఏపీకి రాజధాని పోలవరం అని అంతా కలసి చెప్పాలని పిలుపు ఇచ్చారు. నిజానికి బాబు గారు ఎంత వత్తిడిలో ఉన్నా మరెంత హడావుడిలో ఉన్నా కూడా ఆయన నోట కలల రాజధాని అమరావతి తప్ప మరే పేరు కూడా రాజధాని కోసం రాకూడనే రాకూడదు.

కానీ బాబు గారు మాత్రం పోలవరాన్ని రాజధానిని చేసేశారు. మరి ఆయన కలల రాజధాని అమరావతి ఏమైపోవాలి. సృష్టికర్త నోటి వెంటనే మరో పేరు రాజధానిగా వస్తే అమరావతి ఎంతలా కలవరం చెందాలో కదా. మరెంతలా కలత పడాలో కదా. మమత లేకుండా ఏంటీ మాటలు అని ఆవేదన చెందాలి కదా.

సరే అమరావతి బెంగ పడుతోందా లేదా అన్నది పక్కన పెడితే వైసీపీ వారు ఠక్కున పట్టేసుకున్నారు. సోషల్ మీడియాకు ఎక్కించేసి టాం టాం కొట్టేస్తున్నారు. బాబు గారూ ఏమిటిది ఈ రోజు మెడిసిన్ వేసుకోలేదా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

నిజానికి ఈ రోజునే కాదు దీనికి సరిగ్గా పదిహేను రోజున ముందు విశాఖలో ఆగస్ట్ 15న సమైక ర్యాలీ అంటూ చంద్రబాబు ఒక కార్యక్రమం చేపట్టారు. అందులో ఆయన మాట్లాడుతూ బైపీసీ గ్రూపు తీసుకుంటే ఇంజనీరింగ్

చదవవచ్చు అని ఆణిముత్యాలను వల్లించారు. అది కూడా ఒక్కటే ఒక్కటిగా సోషల్ మీడియాలో మారుమోగింది. అంతే ట్రోలింగ్స్ వీర లెవెల్ లో వచ్చాయి.

ఇంకా ముందుకు వెళ్తే ఏపీలో సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలీ అంటూ నినాదం అందుకున్న బాబు గారు విజయనగరం సభలో మాట్లాడుతూ సైకో పోవాలి అనబోయి పొరపాటున సైకిల్ పాలన పోవాలి అనేశారు. దాంతో అది రివర్స్ అయింది. తెగ బూమరాంగ్ అయింది. నిజమే సైకిల్ ఏపీలో పోవాలి. బాబు గారు తడబాట్లో అయినా కరెక్ట్ గానే చెప్పాలి. అదే జరుగుతుంది తధాస్తూ అనేసింది వైరి పక్షం వైసీపీ.

ఇలాంటివి ఇటీవల కాలంలో బాబు గారి నుంచి ఎక్కువ అవుతున్నాయి. చిత్రమేంటి అంటే చినబాబు లోకేష్ పాదయాత్ర తరువాత స్పీచ్ లో చాలా వరకూ మెరుగు అయ్యారు. ఆయన తప్పులు మాట్లాడితే సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్స్ చేయాలని కాచుకుని కూర్చున్న వారికి ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు.

కానీ చంద్రబాబు మాత్రం ఇలా తడబాట్లూ పొరపాట్లూ చేస్తున్నారు అని అంటున్నారు. ఆయనలో వత్తిడి బాగా పెరిగి ఇలా మాట్లాడుతున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి బాబు గారు మాత్రం ఇలాంటి ఆణిముత్యాలనే పదే పదే వదులుతూంటే వైసీపీ దాన్ని చక్కగా రాజకీయ అస్త్రాలుగా మార్చుకుంటుంది. బాబోరికి వయసు అయిపోయింది కాబట్టే ఇలా అంటూ ఏకంగా అసలుకే ఎసరు పెట్టేలా టీడీపీ ఆశలనే కూల్చేసే వ్యూహాలను రచించగలదు. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు హితైషులు.