తెరపైకి ఓటుకు నోటు... సుప్రీంలో విచారణ డేట్ ఫిక్స్!
"సాగినంత కాలం తనంత వారు లేడందురు.. సాగకపోతే చతికిలపడుదురు" అన్నట్లుగా తయారైంది చంద్రబాబు నాయుడి వ్యవహారం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 1 Oct 2023 6:29 PM GMTకాలం ఎదురుతన్నడం అంటే ఇదేనేమో... "సాగినంత కాలం తనంత వారు లేడందురు.. సాగకపోతే చతికిలపడుదురు" అన్నట్లుగా తయారైంది చంద్రబాబు నాయుడి వ్యవహారం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు మూడువారాలుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులోనే లాక్కోలేకా పీక్కోలేక అన్నట్లుగా ఇబ్బందులు పడుతున్నారంటూ కథనాలొస్తున్న తరుణంలో... ఊహించని రీతిలో ఉన్నపలంగా ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది.
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్, అంగళ్లు అల్లర్ల కేసులు వేళాడుతున్న తరుణంలో తాజాగా ఓటుకు నోటు కేసు బ్యానర్ ఐటం అయ్యింది. అప్పట్లో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన "ఓటుకు నోటు" కేసు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు వేసిన స్క్వాష్ పిటిషన్ అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానున్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించడానికి అత్యున్నత ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా అక్టోబరు 3న ఈ కేసు బెంచ్ ముందుకు వస్తుందనగా.. అదే కోర్టులో ఓటుకు నోటు కేసు కూడా విచారణకు రెడీ అయ్యింది!
2017లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కెసుకు సంబంధించి రెండు పిటీషన్లను దాఖలు చేయగా.. ఈ నెల 4న సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర కేసు లిస్టు అయింది. అప్పట్లో రేవంత్ రెడ్డి చుట్టే తిరిగిన ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర పైన ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో చంద్రబాబునూ చేర్చాలని కోరారు.
ఇదే సమయంలో ఈ ఓటుకు నోటు కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసారు. దీంతో ఈ రెండు పిటిషన్లు బుధవారం బెంచ్ మీదకు వస్తున్నాయని అంటున్నారు!
కాగా... 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు తెలపాలంటూ.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మద్దతును రేవంత్ రెడ్డి కోరారని, ఈ సందర్భంగా రూ. 50 లక్షలు ఇచ్చేందుకు ఆయన నివాసానికి వచ్చారని, దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ రేవంత్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఆ సమయంలో స్టీఫెన్ సన్ ను నాడు టీడీపీ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలు శిక్షను అనుభవించారు.. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసు సుప్రీంకోర్టులో లిస్టయ్యింది!