Begin typing your search above and press return to search.

గుంటూరు కారం : లోకేష్ ఎంట్రీతో హీటే హీటు

సీఎం ఉన్న జిల్లా కాబట్టి లోకేష్ పాదయాత్రలో దూకుడు ప్రసంగాలలో వాడి మరింతగా పెరుగుతాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 4:15 AM GMT
గుంటూరు కారం : లోకేష్ ఎంట్రీతో హీటే హీటు
X

గుంటూరు జిల్లా రాజకీయాలు అంటేనే మిర్చీ ఘాటుతో హీటుతో మిక్స్ అయి ఉంటాయి. అలాంటి గుంటూరు జిల్లాలో నారా లోకేష్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ ప్రకాశం జిల్లాలో సోమవారం రాత్రితో పూర్తి అయింది. ప్రకాశం జిల్లాలో పదిహేడు రోజుల పాటు లోకేష్ పాదయాత్ర సాగింది. చాలా నియోజకర్గాలలో జనాలు బాగానే వచ్చారు. ఇక జిల్లాలో చివరి రోజు అయిన దర్శిలో జనాలు పోటెత్తారు

లోకేష్ స్పీచ్ లో సైతం వాడి వేడి పెరిగింది. పదును తేరిన పద ప్రయోగాలతో ఆయన నేరుగా జగన్ మీదనే బాణాలు వేస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లాలోకి లోకేష్ మంగళవారం ప్రవేశించనున్నారు. గుంటూరు జిల్లా రాజకీయ కేంద్రం. రాజకీయ ముఖ ద్వారం. అటు అధికార వైసీపీ ప్రధాన కార్యాలయం, ఇటు మంగళగిరిలో టీడీపీ ఆఫీస్, మరో వైపు జనసేన ఆఫీస్ ఉన్నాయి. అక్కడ రాజకీయ కార్యకలాపాలతో నిత్యం హీటెక్కుతుంది

మరో వైపు చూస్తే తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉంటారు. చంద్రబాబు సైతం మంగళగిరిలో మకాం మార్చి ఉన్నారు. జనసేనాని ఏపీలో ఎక్కువగా గడుపుతున్నారు. ఈ దశలో లోకేష్ పాదయాత్ర గుంటూరులో ప్రవేశించిందంటే రాజకీయ మంట అటు అధికార వైసీపీ ఇటు టీడీపీల మధ్య గట్టిగానే రాజుకుంటుంది అని అంటున్నారు.

టీడీపీ తరఫున లోకేష్ పాదయాత్రలో సౌండ్ ఇంకా పెంచేది ఇక్కడే అని అంటున్నారు. సీఎం ఉన్న జిల్లా కాబట్టి లోకేష్ పాదయాత్రలో దూకుడు ప్రసంగాలలో వాడి మరింతగా పెరుగుతాయని అంటున్నారు. దానికి ధీటుగా బదులిచ్చేందుకు వైసీపీ సైతం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆరు జిల్లాల టూర్ లోకేష్ పూర్తి చేసుకున్నారు. ఒక విధంగా గ్రేటర్ రాయలసీమ అంతా లోకేష్ చుట్టబెట్టారు.

ఇక ఏడు జిల్లాల పాదయాత్ర ఉంది. అంటే సగానికి సగం యువగళం పూర్తి అయినట్లే అని అంటున్నారు. గుంటూరు నుంచి మరో రకంగా ఈ పాదయాత్ర జోరు పెరగవచ్చు అని అంటున్నారు. గుంటూరు, క్రిష్ణా జిల్లాలు టీడీపీకి పట్టున్న ప్రాంతాలు అలాగే ఒక బలమైన సామాజికవర్గం దన్నుగా ఆ పార్టీకి ఎపుడూ ఉంటూ వస్తోంది. అలాంటి చోట చినబాబు పాదం కదిపితే పొలిటికల్ గా రీ సౌండ్ చేయవచ్చు అని అంటున్నారు.

అయితే గుంటూరు క్రిష్ణా జిల్లాలలో వైసీపీ సైతం ఆధిపత్యం కనబరుస్తోంది. ఏకంగా పార్టీ ప్రెసిడెంట్ కం అధ్యక్షుడు ఉన్న చోటు అది. ఆ పార్టీ అధికారంలో ఉంది. దాంతో వైసీపీ ఎక్కడా తగ్గే ప్రసక్తి ఉండదని అంటున్నారు. ఈ పరిణామంతో నువ్వా నేనా అన్నట్లుగా లోకేష్ పాదయాత్ర ప్రకంపనలు గుంటూరు జిల్లాలోని నలుమూలలా విస్తరించవచ్చు అని అంటున్నారు. మొత్తానికి గుంటూరు కారం ఏంటి అన్నది వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయ హీట్ తో జనాలు ప్రత్యక్షంగా చూడబోతున్నారు అని అంటున్నారు.