ఓడి గెలిచారా...లోకేష్ పవన్ లకు సక్సెస్ మంత్ర అదేనా...?
లోకేష్ మంత్రిగా ఉంటూ పోటీ చేశారు. మంగళగిరిలో ఆయన పోటీ చేస్తే ఓటమి పలకరించింది. మంత్రిగా ఉంటూ తొలి ఎన్నికల్లో పరాజయం లోకేష్ కి బాగా కృంగదీసింది
By: Tupaki Desk | 17 Aug 2023 2:30 AM GMTఇద్దరు ప్రముఖులు. రెండు సీట్లు, ఒక ఎన్నిక. ఓటమి భారం చాలా పడింది. ఆ ఇద్దరే ఒకరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే రెండవ వారు తెలుగుదేశం యువ నేత నారా లోకేష్. ఈ ఇద్దరూ 2019లో తొలిసారి ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రత్యక్ష పోరుకు సిద్ధపడ్డారు.
లోకేష్ మంత్రిగా ఉంటూ పోటీ చేశారు. మంగళగిరిలో ఆయన పోటీ చేస్తే ఓటమి పలకరించింది. మంత్రిగా ఉంటూ తొలి ఎన్నికల్లో పరాజయం లోకేష్ కి బాగా కృంగదీసింది. మరో వైపు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకటి కాదు రెండు చోట్ల పోటీ చేస్తే రెండు సీట్లలోనూ ఓటమి ఎదురైంది. దాంతో పవన్ తో పాటు జనసేన నేతలు అభిమానులు ఖంగు తిన్నారు.
ఇదేమి ఓటమి, ఇదేమి పరాభవం అని అనుచరులు ఫ్యాన్స్ తెగ కలవరపడ్డారు. అయితే కాలం మారింది, గిర్రున క్యాలెండర్ తిరిగేసి నాలుగేళ్ళు దాటింది. 2024లో ఎన్నికలు వస్తున్నాయి. లోకేష్ అయితే మంగళగిరిలో ఓడిన దగ్గర నుంచి టచ్ లోనే ఉంటున్నారు. అక్కడ ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటున్నారు.
దాంతో మంగళగిరిలో ఈసారి లోకేష్ విజయం ఖాయమని అంటున్నారు. ఆయన మీద ఎవరిని పోటీకి పెట్టాలన్నది వైసీపీ ఈ రోజుకీ నిర్ణయం తీసుకోలేకపోవడమే లోకేష్ గెలుపునకు నాంది అని అంటున్నారు. అంత బలంగా లోకేష్ అక్కడ తయారయ్యారా అంటే ఆయనకు ఓటమి నేర్పిన పాఠంగా అది చెప్పుకోవాలని అంటున్నారు.
తాజాగా యువగళం పేరిట లోకేష్ మంగళగిరిలో పాదం మోపితే మంగళగిరి మొత్తం పసుపు మయం అయిపోయింది. లోకేష్ కి మంగళగిరి పసుపు కార్పెట్ పరచేసింది. ఈ విధంగా చూస్తే లోకేష్ విజయానికి ఇది సంకేతమా అనిపించింది.
ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలి. ఆయన గెలుపు గ్యారంటీ అనుకున్నారు. గాజువాక నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికి పవన్ వస్తే మొత్తం గాజువాక అంతా ఆయన వెనక నిలిచింది. దాంతో ఇక డ్యాం ష్యూర్ గెలుపు అనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఏకంగా పదహారు వేల ఓట్ల తేడాతో పవన్ ఓటమి పాలు అయ్యారు.
అయితే నాలుగేళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ గాజువాకలో వారాహి రధమెక్కి టూర్ చేస్తే ఇసుక వేస్తే రాలనంతగా జనం వచ్చారు. దాన్ని చూసిన పవన్ నేను నిజంగా ఓడానా అని కూడా అన్నారు. తనకు ఇంతటి స్వాగతం పలకడం అంటే గెలుపు పక్కాగా గాజువాకలో జనసేనదే అనేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కనుక గాజువాకలో పోటీ చేస్తే గెలుస్తారు అని అంటున్నారు.
అయితే ఆయనే నేరుగా పోటీ చేస్తారా లేక తన వారిని నిలబెడతారా అన్నదే చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా ఓడిన చోట గెలిస్తే ఆ కిక్కే వేరబ్బా అంటోంది పవన్ అభిమాన జనం. అదే నిజం అంటోంది నారా లోకేష్ అనుచరగణం. పోయిన సారి అయిత ఓడిపోయారు ఈసారి ఈ ఇద్దరు నేతలు గెలుపు మంత్రాన్ని పట్టేసారా అంటే అవును అనే అంటున్నరు వారి పక్కన ఉన్న వారు మరి వైసీపీ ఇదంతా చూస్తూ ఊరుకుంటుందా సో వెయిట్ అండ్ సీ.