Begin typing your search above and press return to search.

హైకోర్టులో లోకేష్ కు ఎదురుదెబ్బ... ఢిల్లీ బయలుదేరిన సీఐడీ!

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ను ఏ-14 గా చేర్చుతూ ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Sep 2023 8:00 AM GMT
హైకోర్టులో లోకేష్ కు ఎదురుదెబ్బ... ఢిల్లీ బయలుదేరిన సీఐడీ!
X

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ను ఏ-14 గా చేర్చుతూ ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు లోకేష్. ఈ సమయంలో తాజాగా లోకేష్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను హైకోర్టు డిస్పోస్‌ చేసింది.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో... అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన మెంట్ స్కాం కూడా తరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ స్కాంలో తన పేరు ఉండటంతో... లోకేష్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఏపీ హైకోర్టు ఆ పిటిషన్ ను డిస్పోస్ చేసింది.

ఇదే సమయంలో ఈ కేసులో లోకేష్‌ కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సీఐడీని ఆదేశింశించింది. మరోవైపు విచారణకు సహకరించాల్సిందేనని నారా లోకేష్‌ కు తేల్చి చెప్పిందని తెలుస్తుంది. ఈ కేసులో లోకేష్‌ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే 41-ఏ కింద నోటీసులు ఇచ్చి లోకేష్‌ ను విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టులో జరిగిన వాదనలతో ఇప్పడు సీఐడీ టీం కాసేపట్లో లోకేష్ కు 41ఏ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దంచేస్తుందని అంటున్నారు. ఆ నోటీసులో ఎప్పుడు విచారణకు రావాలనేది స్పష్టం చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో లోకేష్ లబ్ది పొందారని, ఈ స్కాం లో లోకేష్ పాత్ర అత్యంత కీలకం అని సీఐడీ కోర్టులో వాదనలు వినిపించింది.

ఈ నేపథ్యంలో సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం... లోకేష్ కు 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని తెలిపింది. దీంతో... ఆ ఆదేశాలను అనుసరించి నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ ఢిల్లీ బయల్దేరిందని తెలుస్తుంది. ఈ క్రమంలో... మరికాసేపట్లో ఏపీ సీఐడీ అధికారులు లోకేష్‌ ను కలిసి నోటీసులు అందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో... హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు లోకేష్‌ లాయర్లు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్ స్కాం తో పాటు స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాం, ఫైబర్‌ గ్రిడ్‌ కేసుల్లో కూడా నిందితుడిగా ఉండటంతో... ఈ రెండు కేసుల్లోనూ అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ రెండు పిటిషన్లు బెంచ్‌ ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరోపక్క సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి క్వాష్ పిటిషన్ తో పాటు ఏపీ హైకోర్టుల్లో ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల కేసుకు సంబంధించి ముందస్తు పిటిషన్ లు విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సీఐడీ కస్టడీ పిటిషన్ కూడా విచారణలో ఉంది.