మళ్ళీ జనంలోకి లోకేష్....ఏం మాట్లాడుతారు...?
తన తండ్రి ఏ తప్పూ చేయకపోయినా వైసీపీ జైలులో పెట్టించింది అని లోకేష్ జనాలకు చెప్పనున్నారు అంటున్నారు
By: Tupaki Desk | 26 Nov 2023 11:12 AM GMTదాదాపు ఎనభై రోజుల తరువాత టీడీపీ యువనేత నారా లోకేష్ జనంలోకి వస్తున్నారు. సెప్టెంబర్ 9న లోకేష్ రాజోలులో తన యువగళం పాదయాత్ర నిలుపు చేశారు. ఆనాడు చంద్రబాబుని నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఆ విషయం తెలుసుకున్న లోకేష్ విజయవాడకు బయల్దేరారు. అక్కడి నుంచి లోకేష్ కాలు కదపలేదు. మరో వైపు కాలు గాలిన పిల్లిలా ఢిల్లీ టూ విజయవాడ వయా రాజమండ్రి అన్నట్లుగా విమాన యానం చేశారు.
మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ కధ సుఖాంతం అయింది. రెగ్యులర్ బెయిల్ బాబుకు లభించింది. దాంతో లోకేష్ కి జనంలోకి వెళ్ళే చాన్స్ చిక్కింది. తండ్రి చంద్రబాబు కంటే ముందు కొడుకు లోకేష్ జనంలోకి వస్తున్నారు. లోకేష్ ఏమి మాట్లడబోతారు అన్నది ఇపుడు చర్చగా ఉంది. చంద్రబాబు అరెస్ట్ మీద ఆయన జైలు జీవితం మీద లోకేష్ నిప్పులు చెరుగుతారు అని అంటున్నారు.
తన తండ్రి ఏ తప్పూ చేయకపోయినా వైసీపీ జైలులో పెట్టించింది అని లోకేష్ జనాలకు చెప్పనున్నారు అంటున్నారు. ఒక విధంగా చంద్రబాబు టీడీపీ అధికార వైసీపీ చేతిలో బాధితులు అని లోకేష్ జనాలకు తెలియచేస్తారు అని అంటున్నారు. అలాగే వైసీపీ పాలన మీద ఫైర్ అవుతూ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు.
లోకేష్ ప్రసంగాలు ఇక మీదట ప్రతీ రోజూ ఉంటాయి. గతంలో యువగళం సభలలో లోకేష్ మాట్లాడుతూ చాలా గంభీర ప్రకటనలు చేశారు. మీ మీద కేసులు ఎన్ని పెట్టినా నేను కాపాడుకుంటాను అని క్యాడర్ తో
అన్నారు. కానీ చంద్రబాబు మీదనే కేసులు పడ్డాయి. ఆయన బయటకు రావడానికి 52 రోజుల సమయం పట్టింది. మరి ఈసారి అలాంటి ప్రకటనలు ఉంటాయా అన్నది చూడాలని అంటున్నారు.
అలాగే ప్రభుత్వం మీద గతంలో రెచ్చగొట్టే విధంగా లోకేష్ మాట్లాడారు అని వైసీపీ నేతలు విమర్శించేవారు. ఆయన హద్దులు మీరుతున్నారని మంత్రుల నుంచి ప్రతి విమర్శలు వచ్చేవి. ఇపుడు లోకేష్ మళ్లీ అలాంటివి మాట్లాడుతారా అన్నది ఒక చర్చ అయితే మాట్లాడితే వైసీపీ చూస్తూ ఊరుకుంటుందా అన్నది మరో చర్చ.
ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యం ఉంది. దంతో లోకేష్ ఏమి మాట్లాడినా కూడా ఈసారి ఘాటు రిప్లై అధికార పార్టీ నుంచి ఉంటుంది. అంతే కాదు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే దాని మీద కూడా యాక్షన్ కి దిగుతారా అన్న డౌట్లూ ఉన్నాయి. ఇక లోకేష్ చాలా ఆవేశపూరితంగా గతంలో ప్రసంగాలు చేసేవారు.
దాన్ని చూసిన తమ్ముళ్ళు చంద్రబాబు తరువాత భావి వారసుడు అని భావించేవారు. కానీ చంద్రబాబు అరెస్ట్ అయిన క్రమంలో లోకేష్ ఎక్కువ రోజులు ఢిల్లీలో గడపడమే కాకుండా పార్టీని గాలికి వదిలేశారు అన్న విమర్శలు వచ్చాయి. లోకేష్ న్యాయ నిపుణులతో మాట్లాడేందుకే అక్కడ ఉన్నారు అని టీడీపీ నేతలు సర్ది చెప్పినా ఆయన తనను కూడా అరెస్ట్ చేస్తారు అన్న కారణంతోనే ఢిల్లీలో ఉన్నారని కూడా వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి.
ఒక విధంగా చంద్రబాబు అరెస్ట్ తరువాత లోకేష్ పోరాట తత్వం పెద్దగా లేదు అని విమర్శలు వచ్చిన క్రమంలో లోకేష్ ఇపుడు మళ్ళీ యువగళం పాదయాత్రలో గంభీరమైన ఆవేశపూరితమైన ప్రకటనలు చేస్తే వాటిని టీడీపీ తమ్ముళ్ళూ ఎలా రిసీవ్ చేసుకుంటారు జనాలు ఎలా తీసుకుంటారు అన్న చర్చ కూడా ఉంది.
మొత్తానికి చూస్తే మూడు నెలలుగా ఆగిపోయిన లోకేష్ పాదయాత్ర ఇపుడు మొదలు కానుంది. ఈ నెల 27 నుంచి లోకేష్ పాదయాత్ర సాగనుంది. రాజోలు/పి.గన్నవరం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలలో లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది.
రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుని. ఇక తాటిపాక సెంటర్ లో జరిగే బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు. రాత్రికి పేరూరు శివారు విడిది కేంద్రంలో లోకేష్ బస చేస్తారు అని అంటున్నారు. లోకేష్ పాదయాత్రతో ఎన్నికల రాజకీయానికి తెర తీసినట్లే అంటున్నారు.