కొత్త సంప్రదాయం: కామ్రేడ్లపై పోలీసుల ఓవరాక్షన్ కు లోకేశ్ సారీ!
తాజాగా చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర పర్యటనకువెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి పోలీసులు స్థానిక కమ్యునిస్టు నేతల్ని.. ప్రజాసంఘాల వారిని అరెస్టు చేశారు.
By: Tupaki Desk | 2 Aug 2024 5:02 AM GMTఇప్పటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గతంలో రాజకీయ వైరం.. వ్యక్తిగత వైరాల మధ్య విభజన రేఖ చాలా స్పష్టంగా ఉండేది. ఇప్పుడు అది పూర్తిగాచెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ మాటకు వస్తే.. ఏ చిన్న అవకాశం లభించినా రాజకీయ వైరాన్ని వ్యక్తిగతంతో రంగరించి.. బదులు తీర్చుకోవటం ఇటీవల కాలంలో మామూలైంది. ఇలాంటి వేళ.. అందుకు భిన్నమైన తీరును ప్రదర్శించారు ఏపీ మంత్రి నారా లోకేశ్. పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం గురించి సమాచారం తెలుసుకున్నంతనే ఓపెన్ గా సారీ చెప్పేసిన ఆయన తీరు ఆసక్తికరంగా మారింది. ఇది మార్పునకు చిహ్నమని.. ఇలాంటివి ఏపీ రాజకీయాల్లో అవసరమన్న మాట వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి.. మంత్రులు ఎవరైనా జిల్లాల పర్యటనలకు వెళితే.. వారి పర్యటన సందర్భంగా నిరసన చేపట్టే వారిని ముందస్తుగా అరెస్టు చేయటం ఇటీవల కాలంలో మామూలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే.. తాజాగా అలాంటి సీన్ ఏపీలో చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ తరహా చర్యల్ని ఆపేయాలంటూ చెప్పారు. అయినప్పటికీ కొందరు పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు.
తాజాగా చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర పర్యటనకువెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి పోలీసులు స్థానిక కమ్యునిస్టు నేతల్ని.. ప్రజాసంఘాల వారిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. అధికారుల తీరును తప్పుపట్టారు. అరెస్టు చేసిన నేతల్ని వెంటనే విడిచిపెట్టాలని ఆదేశించారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తన ఎక్స్ ఖాతాలో తమను మన్నించాలంటూ కామ్రేడ్ నుకోరుతూ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ తీరు గురించి స్పష్టమైన వైఖరిని వెల్లడించారు.
"సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం.
గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాను" అంటూ తమ ప్రభుత్వం అనుసరించే విధానాల్ని ట్వీట్ రూపంలో తెలియజేయటమే కాదు.. కామ్రెడ్లను క్షమాపణలు కోరటం ద్వారా కొత్త సంప్రదాయానికి తెర తీశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.