Begin typing your search above and press return to search.

అరెస్టు భయం.. నారా లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌!

ఇందులో భాగంగా చంద్రబాబును ఏ1గా, ఏ2గా మాజీ మంత్రి నారాయణను పేర్కొంది. ఇదే కేసులో నారా లోకేశ్‌ ను ఏ14గా చేర్చింది.

By:  Tupaki Desk   |   27 Sep 2023 9:38 AM GMT
అరెస్టు భయం.. నారా లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌!
X

టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్‌ డెవలప్మెంట్‌ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. బెయిల్‌ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా విచారణ వాయిదా పడింది.

ఇప్పుడు చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ వంతు వచ్చింది. తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ లోకేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో ఇన్నర్‌ రింగు రోడ్డు అలైన్మెంట్‌ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, నారా లోకేశ్, తదితరుల పై అభియోగాలు మోపింది. ఈ కేసులో లోకేశ్‌ ను ఏపీ సీఐడీ ఏ14గా పేర్కొంది.

రాజధాని పేరుతో అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) వేసే ప్రాజెక్టు పేరిట నాటి టీడీపీ సర్కార్‌ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదుతో ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌ లో సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు అనంతరం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్మెంట్‌ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఇందులో భాగంగా చంద్రబాబును ఏ1గా, ఏ2గా మాజీ మంత్రి నారాయణను పేర్కొంది. ఇదే కేసులో నారా లోకేశ్‌ ను ఏ14గా చేర్చింది.

ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ఇప్పటికే సిట్‌ ప్రత్యేక మెమో దాఖలు చేసింది. తన తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ విషయంలో జరిగిన స్కామ్‌ లో నారా లోకేష్‌ కీలక భూమిక పోషించారని ఆరోపించింది. అలైన్మెంట్‌ ఖరారులో అక్రమాలతో తమ కంపెనీ హెరిటేజ్‌ ఫుడ్స్‌ కోసం భూములను నారా లోకేష్‌ కొల్లగొట్టినట్లు దర్యాప్తు సంస్థ సీఐడీ నిర్ధారించుకుంది. చంద్రబాబు, నారాయణ, లోకేష్‌ తోపాటు లింగమనేని రమేశ్, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. అయితే నారాయణ ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్‌ పొందారు.

ఈ నేపథ్యంలో లోకేశ్‌ ను అరెస్టు చేస్తారని కొద్ది రోజులుగా వైసీపీ నేతలు, మంత్రులు చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేశ్‌ తన పాదయాత్రను మొదలుపెట్టుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేసే అవకాశం ఉండటంతో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్‌ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఈ పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది.