Begin typing your search above and press return to search.

లోకేష్‌ కు కోర్టు నోటీసులు.. సంక్రాంతికి ముందు ఏమి జరగబోతోంది?

లోకేష్‌ ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ సీఐడీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Dec 2023 6:39 AM GMT
లోకేష్‌ కు కోర్టు నోటీసులు.. సంక్రాంతికి ముందు ఏమి జరగబోతోంది?
X

లోకేష్‌ ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ సీఐడీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. లోకేష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని.. బహిరంగ వేదికలపైనా ఆయన ప్రసంగాలు, ఇంటర్వ్యూలో ఆయన స్టేట్ మెంట్ లు అధికారులను భయబ్రాంతులకు గురిచేసేలా ఉండటంతో పాటు కోర్టు దిక్కరణ కార్యకలాపాలుగా ఉన్నాయని తెలిపారు. ఈ సమయంలో తాజాగా ఆ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది.

అవును... సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో.. లోకేష్‌ పై అరెస్టు ఉత్తర్వులు జారీచేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌‌ పై దాఖలైన పిటిషన్‌ పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.

ఈ సమయంలో... ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ నిందితుడిగా ఉన్నారని, తాము జారీ చేసిన 41ఏ నోటీసులో పేర్కొన్న షరతులకు లోబడి వ్యవహరించడంలో ఆయన విఫలమయ్యారని కోర్టుకు తెలిపింది. ఇదే సమయంలో... ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు అధికారులను, సాక్షులను బెదిరించేలా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారని కోర్టుకు తెలిపారు.

ఈ సందర్భంగా సీఐడీ పిటిషన్‌ పై విచారణ జరిపిన కోర్టు.. లోకేష్‌ కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. ఈ సమయంలో... లోకేష్‌ ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతీవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ పై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో కోర్టు ఆదేశించింది. దీంతో... ఏసీబీ కోర్టు ఆదేశించిన మేరకు లోకేష్‌ కు నోటీసులు అందించేందుకు సీఐడీ అధికారులు బయలుదేరారు.

ఇందులో భాగంగా.. తాడేపల్లి కృష్ణా కరకట్ట మీద ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో లోకేష్ నివాసంలో ఉన్నప్పటికీ బయటకు రాలేదని తెలుస్తుంది. ఈ సమయంలో అధికారులు చాలాసేపు నిరీక్షించినా ఫలితం లేకపోయింది. దీంతో... నోటీసులు అందించేందుకు శుక్రవారం ఉదయం రావాలని లోకేష్ వ్యక్తిగత సిబ్బంది చెప్పారు. దీంతో లోకేష్‌ కు ఇవాళ నోటీసులు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.