పవన్ కు ప్యాకేజ్ పై లోకేశ్ హాట్ కామెంట్స్!
పవన్ కళ్యాణ్ కు ప్యాకేజ్ ఇచ్చారని వైసీపీ ఆరోపిస్తోందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా లోకేశ్ మండిపడ్డారు.
By: Tupaki Desk | 14 Sep 2023 12:05 PM GMTజనసేనాని పవన్ కళ్యాణ్, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడి హైదరాబాద్ కు వెళ్లిపోయాక నారా లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కు ప్యాకేజ్ ఇచ్చారని వైసీపీ ఆరోపిస్తోందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా లోకేశ్ మండిపడ్డారు. పవన్ ప్యాకేజీ తీసుకున్నారనడానికి ఒక్క ఆధారం చూపాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైసీపీ నేతలకు అలవాటేనని ధ్వజమెత్తారు.
ఏపీ చరిత్రలో కీలక నిర్ణయం తీసుకున్నామని లోకేశ్ తెలిపారు. కలిసికట్టుగా జనసేన, టీడీపీ పోరాటం చేస్తాయన్నారు. రాష్ట్రంలో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమన్నారు.
జనసేన, టీడీపీ తరపున జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ అరాచకాలపై పోరాడితే హత్యాయత్నం కేసు పెట్టారని నిప్పులు చెరిగారు. ప్రజల తరపున పోరాడుతున్న టీడీపీ నేతలపై కేసులు పెట్టారని గుర్తు చేశారు.
సైకో పోవాలి– సైకిల్ రావాలి పాటకు వైసీపీ శ్రేణులే డ్యాన్స్ చేశాయని లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు. యువగళం పాదయాత్రపై రాళ్ల దాడి చేసి... తమపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని.. వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినా స్పందన లేదని గుర్తు చేశారు. భీమవరంలో యువగళం పాదయాత్ర శాంతియుతంగా చేశామని.. అయినా మహిళలపై వైసీపీ నేతలు రాళ్లేశారని మండిపడ్డారు. అలాగే అమరావతి రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది చంద్రబాబు అని లోకేశ్ వెల్లడించారు. సైబర్ టవర్స్ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించారన్నారు. ఆధారాలు లేకుండా స్కామ్ జరిగిందని చంద్రబాబుపై కేసు పెట్టారని మండిపడ్డారు. చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్ వార్ మొదలుపెడతామని హెచ్చరించారు. చంద్రబాబు జైలు లోపల ఉన్నా వైసీపీకి చెమటలు పట్టిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మీడియా గొంతు నొక్కేందుకే జీవో తీసుకువచ్చారని.. జగన్ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తేల్చిచెప్పారు.
రాజమండ్రి జైలులో గంజాయి స్మగ్లర్లు, నేరస్థులు ఉన్నారని.. చంద్రబాబుకు జైలులో భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రజల తరపున పోరాడితే అడుగడుగునా అవమానించారన్నారు. తన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించారన్నారు. అలాగే తనపై ఎన్నో మీమ్స్ క్రియేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఏ ఒక్క వర్గానికి కూడా ద్రోహం చేయలేదన్నారు. కాపు సోదరులకు కాపు కార్పొరేషన్ పెట్టారన్నారు. అలాగే రిజర్వేషన్లు కూడా కల్పించారని తెలిపారు. పవన్ ప్యాకేజీ తీసుకున్నట్లు ఒక్క ఆధారం చూపాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటు అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.