Begin typing your search above and press return to search.

జాతీయ మీడియాలో లోకేష్ కామెంట్స్..వైరల్

ఆ ఇంటర్వ్యూలో ఎన్డీఏ కూటమిపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడ అడిగిన ప్రశ్నలకు ఎంతో పరిపక్వతతో, సమయస్ఫూర్తితో లోకేష్ సమాధానమిచ్చిన వైనం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 8:47 AM GMT
జాతీయ మీడియాలో లోకేష్ కామెంట్స్..వైరల్
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నపుడు వైసీపీ నేతలు, ఆ నేతలు చెప్పినట్లు విన్న పోలీసులు యాత్రను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే మొక్కవోని దీక్షతో యాత్ర కొనసాగించిన లోకేష్...పట్టువదలని విక్రమార్కుడిలా యాత్ర పూర్తి చేశారు. నాలుగేళ్లుగా బూత్ స్థాయిలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారిలో ఉత్తేజాన్ని నింపారు. అంతేకాకుండా, మంగళగిరిలో 91,500 ఓట్ల భారీ మెజారిటీతో రికార్డు విజయం నమోదు చేశారు. ఈ విజయంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడ లోకేష్ తన సత్తాను చాటిచెప్పారు. ఈ క్రమంలోనే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిపక్వతకు అద్దం పడుతున్నాయి.

ఆ ఇంటర్వ్యూలో ఎన్డీఏ కూటమిపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడ అడిగిన ప్రశ్నలకు ఎంతో పరిపక్వతతో, సమయస్ఫూర్తితో లోకేష్ సమాధానమిచ్చిన వైనం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి బేషరతుగా మద్దతిస్తున్నామని లోకేష్ చెప్పారు. దానికి బదులుగా ఏపీకి సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో కేంద్రం సహాయసహకారాలు తప్పనిసరిగా ఇవ్వాలని లోకేష్ అన్నారు. దక్షిణాదిలో ఏపీని ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దాలన్న యోచనలో తమ ప్రభుత్వం ఉందని, ఉత్పాదక రంగంలో ఏపీని నంబర్ వన్ గా నిలబెట్టాలన్న సంకల్పంతో ఉన్నామని చెప్పారు. వాటికోసం కేంద్రం నుంచి తమకు సంపూర్ణ మద్దతు కావాలని అన్నారు.

కూటమి, టీడీపీ ప్రయోజనాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తామని లోకేష్ చెప్పారు. కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ చేసే ప్రతి ప్రయత్నంలో కేంద్రం మద్దతు కచ్చితంగా కావాలని, ఆ ఆకాంక్షను కేంద్రం గుర్తించి గౌరవించాలని లోకేష్ తేల్చి చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఎల్లపుడూ ఉంటుంది అంటూనే రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామంటూ లోకేష్ పరిపక్వతతో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేందుకు లోకేష్ సిద్ధమయ్యారని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు.