లోకేశ్ స్పీడ్ మరీ ఇంతనా? ఏయూలో హాట్ టాపిక్!
గతానికి భిన్నంగా అధికారం కోసం తపన పడటం తగ్గించేశారు. ‘పవర్’ చూపించాలన్న ధోరణి తగ్గింది
By: Tupaki Desk | 16 Jun 2024 8:45 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడిగా పరిచయమైన లోకేశ్ లో మార్పు ఎంతలా ఉందన్న విషయం ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టటానికి ముందే తనను తాను నిరూపించుకున్నారు. మంగళగిరి లాంటి ప్రతికూల నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని.. అక్కడి ఓటర్ల మనసుల్ని గెలవటమే కాదు.. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టటం ద్వారా తానేమిటన్న విసయాన్ని అందరికి అర్థమయ్యేలా చేశారని చెప్పాలి.
గతానికి భిన్నంగా అధికారం కోసం తపన పడటం తగ్గించేశారు. ‘పవర్’ చూపించాలన్న ధోరణి తగ్గింది. అదే సమయంలో ప్రజల మనసుల్ని దోచుకోవటానికి తానేం చేయాలన్న దానిపై తపన పెరిగింది. ప్రజలపై తన ముద్ర వేయాలన్న కమిట్ మెంట్ ఎక్కువైంది. అందుకు తగ్గ అవకాశం వస్తే అస్సలు తగ్గని తీరు ఈ మధ్యన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామం దీనికి నిదర్శనంగా చెప్పాలి.
వందేళ్ల పండుగ జరుపుకోనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఆ వర్సిటీకి చెందిన లా స్టూడెంట్ అంజన ప్రియ అనే విద్యార్థిని లోకేశ్ కు వాట్సాప్ ద్వారా ఒక కంప్లైంట్ చేసింది. ఆమె ఫిర్యాదు సారాంశాన్ని క్లుప్తంగా చూస్తే..
- రాజకీయ ప్రయోజనాల కోసం ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి.. వర్సిటీలోని కీలక అధికారులు అవినీతి.. అక్రమాలకు పాల్పడుతున్నారు. దాన్ని ప్రశ్నించినందుకు నన్ను ఏయూ లేడీస్ హాస్టల్ చీఫ్ వార్డెన్ వార్నింగ్ ఇచ్చారు.
- ఇదే అంశంపై నేను షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ఛైర్మన్ కు కంప్లైంట్ చేశాను.
- అడ్డదారిలో రిజిస్ట్రార్ గా వచ్చిన జేమ్స్ స్టీఫెన్ ఆ పదవికి అర్హులు కారు. వీసీ ఎన్నికల సమయంలో వర్సిటీ నిధులను.. వనరుల్ని దోచేవారు.
- ఏయూ ప్రొఫెసర్ ఒకరు 1400 పీహెచ్ డీలను అమ్ముకున్నారు.
- ఏయూలో ఫైళ్లు మాయం కాక ముందే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
- విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల విగ్రహాలు.. పుట్టినరోజు వేడుకలు.. జెండాలు.. కార్లతో ర్యాలీలు చేపట్టారు.
- వందేళ్ల వర్సిటీ పండక్కి సిద్ధమవుతున్న వేళ.. వర్సిటీలో నెలకొన్న అవినీతిని పెకిలించాలి.
ఈ ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే విద్యపై ఉన్నతాధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్ లో ఏయూ వర్సిటీ విద్యార్థిని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటమే కాదు.. ఆమె చేసిన ఫిర్యాదుపైనా చర్చించారు. తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. అధికారులు ఉరుకులు పరుగులతో సదరు లా స్టూడెంట్ ను సంప్రదిస్తున్నారు. ఉన్నత విద్యాశాఖాధికారులు ఆమెకు ఫోన్ చేయటమే కాదు.. చర్యలు తీసుకుంటామన్న భరోసా ఇచ్చారు. ఇదంతా చూసిన సదరు విద్యార్థిని విస్మయానికి గురవుతున్న పరిస్థితి. తాను కంప్లైంట్ చేసిన రోజు వ్యవధిలోనే ఇంతటి స్పందన ఉంటుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆమె చెప్పటం గమనార్హం. ఇదంతా చూస్తే.. లోకేశ్ స్పీడ్ ఎంతన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.