హోం మినిస్టర్ గా నారా లోకేష్ ?
టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఈ నెల 12న నాలుగవ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయబోతున్నారు.
By: Tupaki Desk | 8 Jun 2024 11:36 AM GMTటీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఈ నెల 12న నాలుగవ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయబోతున్నారు. బాబు మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది. ఏ ఏ శాఖలు ఎవరికి దక్కుతాయి అన్న దాని మీద చర్చ సాగుతోంది.
ఇక టీడీపీలో అందరి చూపూ యువ నాయకుడు నారా లోకేష్ మీద ఉంది. నారా లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరుతారా చేరరా అన్న చర్చ ఒక వైపు ఉంటే ఆయన కచ్చితంగా చేరుతారు అని మరో వైపు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. నారా లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరితేనే ఆయన అనుకున్న విధంగా సీఎం సీటు లక్ష్యానికి చేరుకోగలరు అని అంటున్నారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ గతసారి ఐటీ పంచాయతీ రాజ్ వంటి కీలకమైన శాఖలను చేపట్టారు. ఈసారి ఆయనకు అవే శాఖలు ఇస్తారా లేక వేరే శాఖలు ఎంచుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది.
అయితే నారా లోకేష్ కి హోం శాఖ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. ఆయన కూడా యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ ఒకటి తీసుకుని సభలలో మాట్లాడారు. ఎవరెవరు తప్పు చేశారో వారి పేర్లు అన్నీ రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ రెడ్ బుక్ ఆధారంగా చట్టపరంగానే వారిపైన చర్యలు ఉంటాయని ఆయన పదే పదే చెబుతూ వచ్చారు. టీడీపీ కూటమి గెలిచిన తరువాత లోకేష్ ఇస్తున్న ఇంటర్వ్యూలలో సైతం తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు.
దానిని బట్టి చూస్తే కనుక ఆయన హోం మంత్రిత్వ శాఖ మీద మోజు పెంచుకున్నారు అని అర్ధం అవుతోంది అంటున్నారు. హోం మంత్రి అంటే అత్యంత కీలకమైనది సీఎం తరువాత ప్రాధాన్యత కలిగిన మంత్రిగా ఉంటారు. లోకేష్ ప్రభుత్వంలో పార్టీలో చంద్రబాబు తరువాత నంబర్ టూ గా ఉంటున్న నేపధ్యంలో ఆయనకు హోం శాఖ ఇవ్వడమే కరెక్ట్ అని అంటున్నారు.
మరో వైపు చూస్తే లోకేష్ తన తల్లిని దూషించిన వారిని ఏ విధంగానూ వదిలిపెట్టను అంటూ మూడేళ్ళ క్రితమే భారీ ప్రతిజ్ఞ చేశారు. తన తల్లిని అకారణంగా అవమానించారని అలాగే తన కార్యకర్తలను అవమానించారని లోకేష్ అప్పట్లో తీవ్ర నిరసన తెలియచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
ఇక చంద్రబాబు అరెస్ట్ తో పాటు టీడీపీలో ఉన్న పలువురు కీలక నేతల అరెస్టులు కూడా గత అయిదేళ్ళలో టీడీపీ చూసింది. దాంతోనే లోకేష్ చాలా సార్లు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపించారు. అధికారంలోకి మేము వస్తామని తప్పుడు వ్యవహారాలు చేసిన ప్రతీ ఒక్కరి పని పడతామని కూడా స్పష్టం చేశారు.
ఆ విధంగా చూస్తే కనుక లోకేష్ రెడ్ బుక్ కి ఏపీలో ఎంతో పేరు వచ్చింది. దాని మీదనే చర్చ కూడా సాగింది. ఇపుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రెడ్ బుక్ మీద మరింతగా చర్చ సాగుతోంది. రెడ్ బుక్ లో రాసుకున్న అంశాలను పూర్తిగా నూరు శాతం అమలు చేయలేఎ అంటే కనుక హోం మినిస్టర్ పోస్ట్ లోకేష్ కే ఇవ్వాలని అంటున్నారు.
వ్యవస్థలను గాడిలో పెడతాం లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెడతామని కూడా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా చెప్పుకొచ్చారు. వీటిని బట్టి చూస్తే నారా లోకేష్ హోం మినిస్టర్ అవుతారు అని అంటున్నారు. ఇక రాజకీయంగా చూస్తే టీడీపీకి లోకేష్ భావి వారసుడు. ఈ టెర్మ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా లోకేష్ ని సీఎం గా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా అటు జనాల్లో ఇటు పార్టీలో కూడా ఒక సిగ్నల్ పంపించాల్సి ఉంది.
ఇవన్నీ జరగాలీ అంటే ప్రభుత్వంలో లోకేష్ పాత్ర అత్యంత కీలకంగా ఉండాలి. అది జరగాలీ అంటే ఆయనకు హోం మినిస్టర్ పదవి సరైందని అంటున్నారు. ముఖ్యమంత్రి తరువాత ఆయన పరోక్షంలో క్యాబినెట్ మీటింగ్స్ నిర్వహించాలన్నా ఏమి చేయాలన్నా డెసిషన్స్ తీసుకోవాలన్నా హోం మిన్స్టర్ రోల్ చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. దాంతో లోకేష్ హోం మినిస్టర్ కచ్చితంగా అవుతారు అని అంటున్నారు. ఆ దిశగా చంద్రబాబు కూడా ఆలోచిస్తారు అని అంటున్నారు.