Begin typing your search above and press return to search.

రంగంలోకి నారా లోకేష్ .. ఫ‌స్ట్ డే ఏం చేశారంటే!

టీడీపీ యువ నాయ‌కుడు, మాన‌వ వ‌న‌రులు, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌.. మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన అనంత‌ర‌మే కార్య‌రంగంలోకి దూకేశారు.

By:  Tupaki Desk   |   15 Jun 2024 11:45 AM GMT
రంగంలోకి నారా లోకేష్ .. ఫ‌స్ట్ డే ఏం చేశారంటే!
X

టీడీపీ యువ నాయ‌కుడు, మాన‌వ వ‌న‌రులు, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌.. మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన అనంత‌ర‌మే కార్య‌రంగంలోకి దూకేశారు. ఆయ‌న‌కు శాఖ‌లు కేటాయించిన త‌దుపరి రోజే.. కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ముందుగానే ఆయ‌న ఉద‌యం 8 గంట‌ల‌కు.. ప‌ని ప్రారంబించారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వినేందుకు ఆయ‌న ప్రాధాన్యం ఇచ్చారు. శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు కూడా.. ఆయ‌న ఇంట్లోనే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

వార్డుల వారిగా ప్ర‌జ‌ల‌ను త‌న ఇంటికి ఆహ్వానించారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇదేస‌మ‌యంలో అప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించే స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని సంబంధిత అధి కారుల‌ను ఆయ‌న ఆదేశించారు. ఇదేస‌మ‌యంలో త‌న శాఖ‌తో సంబంధం లేని స‌మ‌స్య‌ల‌ను రాసుకుని.. ఆయా శాఖ‌ల‌కు నోట్ పంపించాల‌ని ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీల‌ను ఆదేశించారు. స‌మ‌స్య ఏదైనా.. స‌రే.. న‌మోదు చేసుకుని నిర్దిష్ట గ‌డువులోగా వాటిని ప‌రిష్క‌రిస్తామ‌ని ప్ర‌జ‌లకు ఆయ‌న తేల్చి చెప్పారు.

గ‌రిష్టంగా 15 రోజుల్లో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో మంగ‌ళ‌గి రిలోని వార్డుల వారిగా.. నారా లోకేష్ వాట్సాప్ గ్రూపుల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. వాట్సాపు గ్రూపుల్లో 100 వ‌ర‌కు స‌భ్యుల‌ను చేర్చుకునేందుకు అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో వారిని అందులో జాయిన్ చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్రతి ఇంటికీ ఒక‌రిని వాట్సాప్ గ్రూపుల్లో చేర్చుకుని వారు ఇచ్చే ఫీడ్ బ్యాక్‌తో పాటు స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిశీలించేందుకు పార్టీ కార్యాల‌యంలోనే ఒక విభాగం ఏర్పాటు చేయ‌నున్నారు.

త‌న దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌తోపాటు.. వాట్సాప్ గ్రూపుల్లో వ‌చ్చే చిన్న పాటి స‌మ‌స్య‌ల‌ను కూడా.. సాధ్య‌మైనంత వేగంగా ప‌రిష్క‌రించేందుకు కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకోవాల‌ని.. త‌న అధికారుల‌కు నారా లోకేష్ సూచించారు. పెద్ద స‌మ‌స్య‌లు అయితే.. త‌న దృష్టికి తీసుకురావాల‌ని.. లేక‌పోతే.. మిగిలిన వాటిని క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి అప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ప‌ర్స‌నల్ సెక్ర‌ట‌రీని ఆదేశించారు. మొత్తంగా నారా లోకేష్ తొలిరోజే కార్య‌రంగంలోకిదిగిపోవ‌డం గ‌మ‌నార్హం.