Begin typing your search above and press return to search.

లోకేష్ ని ఓడించేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్...?

ఇదిలా ఉంటే మంగళగిరిలో వైసీపీకి బలం బాగా పెరిగింది అని భావిస్తున్న వేళ ఆ బలమే ఇబ్బంది అవుతుందా అన్న చర్చకు తెర లేస్తోంది

By:  Tupaki Desk   |   22 Aug 2023 12:00 PM GMT
లోకేష్ ని ఓడించేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్...?
X

గుంటూరు జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా మంగళగిరి ఉంది. ఈ సీటుకు ఉన్న రాజకీయ ప్రాధాన్యత ఏంటో 2019 ఎన్నికలు తెలియచెప్పాయి. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రిగా ఉన్న నారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. పైగా ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న సీటు. దాంతో ఈసారి గెలిచి సత్తా చాటాలని టీడీపీ భావిసోంది.

నారా లోకేష్ కూడా గడచిన నాలుగేళ్లుగా మంగళగిరిని అట్టిపెట్టుకునే ఉన్నారు. ఆయన యువగళం పాదయాత్రలో సైతం అయిదు రోజుల పాటు మంగళగిరిలో తిరిగారు అంటే ఎంతటి ప్రతిష్టగా తీసుకున్నారో ఆలోచించాలి. ఇక వైసీపీకి ఈ సీటు చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు. 2024లో మరోసారి లోకేష్ ని ఇక్కడ నుంచే ఓడించాలని చూస్తోంది.

ఇదిలా ఉంటే మంగళగిరిలో వైసీపీకి బలం బాగా పెరిగింది అని భావిస్తున్న వేళ ఆ బలమే ఇబ్బంది అవుతుందా అన్న చర్చకు తెర లేస్తోంది. ఎందుకంటే టీడీపీ మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావుని వైసీపీలోకి తెచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ దక్కింది. ఇక 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవికి వైసీపీ కండువా కప్పి కీలక పదవి ఇచ్చింది.

అలాగే 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కండ్రు కమల కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మురుగుడు హనుమంతరావు తన కుమార్తె అరుణకుమారికి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే గంజి చిరంజీవి తానే నారా లోకేష్ ని ఓడించే క్యాండిడేట్ అని ప్రకటించేసుకుంటున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి ఎటూ ఉన్నారు.

ఇలా మంగళగిరి వైసీపీలో నాలుగు స్తంభాలాట సాగుతోంది. ఎవరికి టికెట్ ఇవ్వాలి, మిగిలిన వారిని ఎలా కో ఆర్డినేట్ చేసుకోవాలన్నది ఇపుడు వైసీపీకి అతి పెద్ద సమస్యగా మారింది అని అంటున్నారు. ముఖ్యామంత్రి జగన్ నివాసం అయిన తాడేపల్లి ప్రాంతం కూడా మంగళగిరి పరిధిలో ఉంది. మొత్తం మీద చూస్తే మంగళగిరి వైసీపీకి చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. కానీ నారా లోకేష్ ఓడించే సమర్ధులు ఎవరూ అన్నదే ఇపుడు వైసీపీకి పట్టుకున్న సమస్యగా ఉంది అని అంటున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే తో పాటు ఆశావహులు నలుగురు ఉన్న వేళ ఎవరిని కాదని అన్నా కూడా వారు పార్టీకి సహకరిస్తారా అన్న చర్చ ఉంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేని సత్తెనపల్లికి లేదా గురజాల నియోజకవర్గానికి పంపించడం ద్వారా మంగళగిరి టికెట్ ని గంజి చిరంజీవికి ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు 2014 ఎన్నికల్లో గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు.

ఇక ఎమ్మెల్సీగా అవకాశం ముగురుడు హనుమంతరావుకు ఇచ్చారు కాబట్టి ఆయన కుమార్తెకు చాన్స్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఇక కాండ్రు కమలకు ఎమ్మెల్సీ హామీ ఇస్తారని అంటున్నారు. మొత్తం మీద నారా లోకేష్ మీద అంతా కలసి పోరాడే విధంగానే వైసీపీ వ్యవహారం సెట్ చేస్తుంది అని అంటున్నారు. అయితే ఈసారి నారా లోకేష్ తో వైసీపీ పోటీ హోరా హోరీగానే ఉంటుంది అని అంటున్నారు.