ఢిల్లీ కబురు : అమిత్ షా తో లోకేష్... ?
అలాగీ వీలున్నంత మేరకు అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి బాబు అరెస్ట్ ఎలా జరిగింది అన్నది వివరిస్తారు అని అంటున్నారు
By: Tupaki Desk | 15 Sep 2023 9:05 AM GMTచంద్రబాబు తనయుడు, టీడీపీ యువ నేత నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో అడుగుపెట్టగానే ఏదో జరుగుతుందని ఒక వైపు టీడీపీ అనుకూల మీడియా గట్టిగానే చెబుతోంది. లోకేష్ ఏకంగా కొన్ని రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి జాతీయ స్థాయిలో బాబు అరెస్ట్ మీద ఫోకస్ వచ్చేలా చూస్తారని అంటున్నారు.
అలాగీ వీలున్నంత మేరకు అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి బాబు అరెస్ట్ ఎలా జరిగింది అన్నది వివరిస్తారు అని అంటున్నారు. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఉంది, విపక్షాల మీద ఏ రకంగా వేధింపులు ఉన్నయాని కూడా వివరిస్తారు అంటున్నారు.
ఇక ఇంతకంటే పెద్ద పని మీదనే లోకేష్ ఢిల్లీ వచ్చారని అంటున్నారు. ఢిల్లీ టూర్ లో లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇందులో నిజమెంత అన్నది చూడాల్సి ఉంది. వాస్తవానికి అయితే ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కీలక బిల్లులు సభలో ప్రవేశపెడతారు.
అందులో హోం శాఖకు సంబంధించిన బిల్లులు చాలానే అంటున్నారు. దాంతో బిజీ గానే అమిత్ షా ఉంటారని తెలుస్తోంది. అలాంటి అమిత్ షా నారా లోకేష్ కి అపాయింట్మెంట్ ఇస్తారా అన్నది కూడా చర్చ సాగుతోంది. ఏపీలో చంద్రబాబు 2019లో ఓడిన దగ్గర నుంచి కేంద్ర పెద్దలతో భేటీకి ఎంతో ప్రయత్నం చేస్తే అది ఈ ఏడాది మధ్యలో జరిగింది అని గుర్తు చేస్తున్నారు. అది కూడా అమిత్ షాతో మాత్రమే బాబు భేటీ కాగలిగారు, మోడీతో అపాయింట్మెంట్ కావాలని అనుకున్నా కుదరలేదు
ఇక ఇపుడు లోకేష్ అపాయింట్మెంట్ కోరారని ఢిల్లీ కబురు చెబుతోంది. కానీఎ అమిత్ షా ఆయనకు అది ఇస్తారా అన్నది చూడాలని అంటున్నారు. ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయంగా కేంద్ర పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు అధికారంలో వైసీపీ ఉంది టీడీపీ మీద కేసులు పెడుతోంది, దేశంలో చాలా రాష్ట్రాలలో అలాగే ఉన్న సీన్ కనిపిస్తోంది.
వీటిని గురించి బీజేపీ ఎంతవరకూ పట్టించుకుంటుంది అన్నది కూడా చూడాలని అంటున్నారు. అయితే టీడీపీతో పొత్తులు ఉంటాయని ఏపీ బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఏపీ బీజేపీ నాయకత్వం అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ని ఖండించింది. వైసీపీకి వ్యతిరేక స్టాండ్ తో గట్టిగా ఉంది.
దాంతో ఏపీ బీజేపీ నేతల మాటలను కేంద్ర పెద్దలు ఆలకిస్తే అలాగే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన నాయకుల పలుకుబడి ఉపయోగపడితే అమిత్ షాతో లోకేష్ భేటీ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. వీటికి మించి టీడీపీతో పొత్తుకు కేంద్ర బీజేపీ నాయకత్వం సుముఖంగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది అని అంటున్నారు.
అయితే ఇక్కడో చిక్కు ఉంది అని అంటున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో అనేక కీలక బిల్లులకు వైసీపీ ఎంపీల ఫుల్ సపోర్ట్ బీజేపీకి కావాలి. అలాంటి తరుణంలో వైసీపీ మీద ఫిర్యాదు చేయడానికి సాక్ష్యాత్తూ చంద్రబాబు తనయుడు వస్తే ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి బీజేపీ పెద్దలు పక్కన కూర్చోబెట్టుకుంటే వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్న చర్చ కూడా ఉందని అంటున్నారు.
ఈ కీలక సమయంలో బీజేపీ న్యూట్రల్ గానే ఉంటుందని అంటున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా కేంద్రానికి పూర్తిగా తెలుసు అంటున్నారు. దాంతో అమిత్ షాతో నారా లోకేష్ భేటీ అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో అద్భుతమే అని చెప్పాలని అంటున్నారు. ఇక అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తూనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవాలని కూడా టీడీపీ డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకే టీడీపీ ఓటేసి మద్దతు ఇచ్చింది. ఆమె రాజ్యాంగ రక్షకురాలు. అందువల్ల ఏపీలో జరుగుతున్న పరిణామాలను చంద్రబాబు వంటి దిగ్గజ నేత అరెస్ట్ ని కూడా ఆమె దృష్టికి తీసుకుని వెళ్ళాలని లోకేష్ నాయకత్వంలోని టీడీపీ టీం అనుకుంటోందిట. ఏది ఏమైనా నారా లోకేష్ ఢిల్లీ టూర్ లో ఏమి జరుగుతుంది అన్నది చూడాలని అంటున్నారు. అయితే టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఢిల్లీలో లోకేష్ వైసీపీ మీద ఫుల్ అటాక్ స్టార్ట్ చేశారనే ప్రచారం చేస్తున్నారు అంటున్నారు.