'రెడ్‌బుక్' రాజకీయం లేనట్టేనా?
దీంతో రెడ్ బుక్ సంగతిని నారా లోకేష్ ఏం చేస్తారనే విషయంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పార్టీ అధికారం చేపట్టి పది రోజులు అయిపోయింది.
By: Tupaki Desk | 22 Jun 2024 2:30 PM GMTరెడ్ బుక్-ఏపీలో ఈ మాట అందరి నోటా పలికిందే. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆ పార్టీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్.. తొలిసారి `రెడ్ బుక్` అనే మాట వినియోగించారు. ముఖ్యంగా యువగళం పాదయాత్ర చేసిన సమయంలో రెడ్ బుక్ అనే ప్రస్తావన తీసుకువచ్చారు. అప్పటి వైసీపీ ప్రభుత్వ అధినేత, సీఎం జగన్ ఆదేశాలతో రెచ్చిపోయి.. తమను అణిచేస్తున్న అధికారుల పేర్లను దీనిలో రాసుకుంటున్నట్టు లోకేష్ చెప్పారు. అంతేకాదు.. తాము అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇది అప్పట్లో టీడీపీ నేతల మధ్య జోరుగా ప్రచారంలోకి వచ్చింది. తమపై కేసులు నమోదు చేసిన అధి కారులను నారా లోకేష్ వదిలి పెట్టరని కూడా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు భావించారు. దీంతో కేసు లకు వెరవకుండానే వారంతా పార్టీ కోసం పనిచేశారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి వరకు కూడా.. ధర్నాలు నిరసనలు చేశారు. ఇదేసమయంలో పార్టీకి అండగా ఉన్నారు. ఇదంతా కూడా.. నారా లోకేష్ ఇచ్చిన రెడ్ బుక్ టానిక్కే కారణం. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది.
దీంతో రెడ్ బుక్ సంగతిని నారా లోకేష్ ఏం చేస్తారనే విషయంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పార్టీ అధికారం చేపట్టి పది రోజులు అయిపోయింది. ఈ నేపథ్యంలో రెడ్ బుక్‌లో నారా లోకే ష్ నమోదు చేసుకున్న పేర్ల వారీగా చర్యలు ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయని వారు చూస్తున్నారు. అయితే.. ఎన్నికలకు ముందు.. నారా లోకేష్ రెడ్ బుక్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసినా.. గెలిచిన తర్వాత ఆ బుక్ ఊసెత్తడం మానేశారు. కనీసం.. రెడ్ బుక్ అన్న పదం కూడా.. ఇప్పటి వరకు ఆ యన నోటి నుంచి రాలేదు.
దీంతో నారా లోకేష్ ఇక, రెడ్ బుక్ సంగతిని మరిచిపోయారా? లేక.. జాలిపడి వదిలేశారా? అనే చర్చ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జోరుగా సాగుతోంది. అయితే.. దీనికి మరో కారణం ఉందని తెలుస్తోంది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కక్ష పూరిత, కుట్ర పూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలని.. ప్రజలు భారీ విజయం అందించిన నేపథ్యంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తేల్చి చెబుతున్నారు. ఇటు సభలోనూ.. అటు పార్టీ నాయకులతోనూ ఆయన ఇదే మాట చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ ఆధారంగా చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదని పార్టీ సీనియర్లు చెబుతున్నాయి. అయిందేదో అయిపోయింది.. ఇప్పుడు కక్షలు కార్ఫణ్యాలతో కాలం గడిపే పరిస్థితి లేదని చంద్రబాబు అంటున్నారు. గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టడం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్న దరిమిలా.. రెడ్ బుక్ సంగతి ఇక, మరిచిపోవడమేనని అంటున్నారు.