చిన్నబాబు తొందరపాటు.. జాగ్రత్తగా ఉండొద్దు...?
కొన్నాళ్ల కిందట వినుకొండలో జరిగిన దారుణ హత్యతో తమకు సంబంధం లేదని నారా లోకష్ ప్రకటించారు.
By: Tupaki Desk | 19 Aug 2024 4:25 AM GMTటీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ దూకుడు విమర్శలకు తావిచ్చేలా కనిపిస్తోంది. ఎక్కడ ఎలాంటి ఘ టన జరిగినా.. ఆయన దానికి-వైసీపీకి లింకు పెట్టి విమర్శలు చేస్తున్నారు. దీనిని ప్రధాన మీడియా హైలెట్ చేస్తోంది. అయితే.. ఎక్కువ సందర్భాల్లో నారా లోకేష్ చేస్తున్న విమర్శలు బూమరాంగ్ అవుతున్నాయి. దీంతో వాటిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయినా.. ఆయన మౌనంగా ఉంటున్నారు. దీనివల్ల ఉన్న ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది.
కొన్నాళ్ల కిందట వినుకొండలో జరిగిన దారుణ హత్యతో తమకు సంబంధం లేదని నారా లోకష్ ప్రకటించారు. ఇదంతా వైసీపీ కుట్రేనని తేల్చి చెప్పారు. కానీ, పోలీసులు నమోదు చేసిన చార్జిషీట్‌లో హంతకుడిని టీడీపీ కార్యకర్తగా పేర్కొన్నారు. దీనిని వైసీపీ నాయకులు హైలెట్ చేశారు. ఫలితంగానారా లోకేష్ వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. పోనీ.. తర్వాతైనా..ఆయన మారతారని అనుకుంటే.. అప్పుడు కూడా మారలేదు. గత వారం జరిగిన హత్యలో కూడా వైసీపీ నాయకుడే ఉన్నారని ఆరోపించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం పరిధిలోనిహోసూరులో జరిగిన శ్రీనివాసులు హత్యపై నారా లోకేష్ హుటాహుటిన స్పందించారు. ఇది వైసీపీ చేసిన హత్యేనని.. టీడీపీ మౌనాన్ని వారు చేతకాని తనంగా భావిస్తున్నారని నిప్పులు చెరిగారు. దీంతో అందరూ వైసీపీ నేతలే.. టీడీపీ నేత శ్రీనివాసులును హత్య చేశారని అందరూ అనుకున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు ఏం జరిగిందో చెప్పారు. దీంతో ఇక్కడ నారా లోకేష్ విఫలమయ్యారు.
టీడీపీలో ఉన్న శ్రీనివాసులు, నర్సింహులు అనే కార్యకర్తతో(ఈయన మాజీ హెడ్ కానిస్టేబుల్) వివాదాలు ఉన్నాయి. గతంలో హోసూరు రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఓ సారి నర్సింహులును శ్రీనివాసులు అందరి ముందే చెప్పుతో కొట్టారు. దీనిని మనసులో పెట్టుకున్న నర్సింహులు.. తాజాగా తన బంధువులు, గ్రామంలోని వారితో కలిసి శ్రీనివాసులును కళ్లలో కారం కొట్టి దారుణంగా నరికి చంపారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు సాక్ష్యాలతో సహా చెప్పారు. దీంతో నారా లోకేష్ మరోసారి బూమరాంగ్ అయ్యారు. ఇలాంటిఘటనలు వచ్చినప్పుడు.. నారా లోకేష్ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.