లోకేష్ ఓఎస్డీ గా యంగ్ ఆఫీసర్.. కడప నుంచి ఏరి కోరి..!
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ కేబినెట్ లో ఎక్కువ మంది యంగ్ మంత్రులే ఉన్నారనే చర్చ ఇటీవల బాగా జరిగింది
By: Tupaki Desk | 1 Aug 2024 8:14 AM GMTప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ కేబినెట్ లో ఎక్కువ మంది యంగ్ మంత్రులే ఉన్నారనే చర్చ ఇటీవల బాగా జరిగింది. ఇదే సమయంలో.. ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా ఎక్కువగా ఉన్నంతలో యువకులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారనే మాటలూ వినిపిస్తున్నాయి. అయితే... ఇలా యువకులకు పెద్ద పీట వేయడం వెనుక లోకేష్ పాత్ర కీలకం అనే మాటలు వినిపించాయి.
ప్రధానంగా.. యంగ్ అండ్ ఎక్స్ పీరియన్స్డ్ మేళవింపును ఆయన ప్రిఫర్ చేస్తున్నారని అంటున్నారు! ఈ నేపథ్యంలో తన ఓఎస్డీగా లోకేష్ తాజా ఎంపిక కూడా ఆ దిశగానే ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో తాజాగా కడప జిల్లా నుంచి ఏరి కోరి ఓ యంగ్ ఆఫీసర్ ను మానవ వనరుల శాఖలో లోకేష్ తన ఓఎస్డీగా నియమించుకున్నారు! ఆయన పేరు ఆకుల వెంకటరమణ.
అవును.. ఏపీ మంత్రి లోకేష్ ఓఎస్డీగా యంగ్ ఆఫీసర్ ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. దీంతో... లోకేష్ ఈ స్థాయిలో కడపలో ఉన్న ఆయన్ను ఏరి కోరి మరీ తెచ్చుకొన్నారంటే.. ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఆయన వివరాలు తెలుస్తుకొందాం...!
ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన శ్రీరాములు - లక్ష్మీనరసమ్మల కుమారుడు ఈ వెంకట రమణ. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన.. చిన్ననాటి నుంచీ కష్టపడి చదివారు. ఈ క్రమంలో విద్యాభ్యాసం మొత్తం మార్కాపురంలో జరిగింది. 2000లో ఇంటర్ పూర్తయ్యాక బీటెక్ సీటు కోసం ఏడాది పాటు సొంతంగా ఎంసెట్ కు ప్రిపేర్ అయ్యి 2001లో వెయ్యి ర్యాంక్ సాధించారు.
ఈ క్రమంలో... నాలుగేళ్లు బీటెక్ తర్వాత క్యాంపస్ సెలక్షన్స్ లో ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థలో సర్క్యూట్ డిజైనర్ ఇంజినీర్ గా ఉద్యోగం సాధించారు. ఇలా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో కొలీగ్స్ తో కలిసి సమీప ప్రాంతాల్లోని స్కూళ్లకు వెళ్లి, అక్కడ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు! ఈ నేపథ్యలోనే ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా... ఏపీపీఎస్సీ గ్రూప్-1 కు తొలిసారిగా 2011లో హాజరుకాగా, ఇంటర్వూ వరకూ వెళ్లారు. అయితే... దురదృష్టవసాత్తు అది కాస్తా రద్దైంది. అయితే తిరిగి 2012లో రీ-ఎగ్జామినేషన్ నిర్వహించగా.. అందులో వెంకటరమణ మార్కుల పరంగా గ్రూప్-1 టాపర్ గా నిలిచారు. ఈ సమయంలో ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేశారు.
అక్కడ గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం అక్కడ నుంచి కడప జిల్లా బద్వేలు ఆర్డీవోగా ట్రాన్స్ ఫర్ అయ్యారు. అక్కడ కూడా సమర్ధవంతమైన ఆఫీసర్ గా పేరు సంపాదించుకున్నారు! ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా నియమితులయ్యారు!