Begin typing your search above and press return to search.

పవన్ చెప్పిన ఆ ఒక్కమాటే లోకేష్ బలం!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులో ఉన్న టీడీపీ - జనసేన మధ్య ఇప్పుడొక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది

By:  Tupaki Desk   |   23 Dec 2023 12:30 AM GMT
పవన్ చెప్పిన ఆ ఒక్కమాటే లోకేష్ బలం!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులో ఉన్న టీడీపీ - జనసేన మధ్య ఇప్పుడొక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇది కాస్త వివాదాస్పదం అవుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ తప్ప మిగిలిన వారు చాలా మంది ఈ విషయంపై స్పందిస్తున్నారు. అదే... టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అనేది? ఈ విషయంపై లోకేష్ నాన్చుడు ధోరణి లేకుండా సూటిగా స్పష్టంగా స్పందించారు. దీంతో ఈ చర్చ హాట్ టాపిక్ గా మారింది.

అవును... రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జ‌న‌సేన కూట‌మి అధికారంలోకి వ‌స్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతార‌ని లోకేష్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఇప్పటికే పూర్తి క్లారిటీతో పాటు బలమైన నమ్మకం ఉండటంతో టీడీపీ శ్రేణుల నుంచి పెద్దగా రియాక్షన్స్ రావడం లేదు! కానీ... జనసేనకు సంబంధించిన శ్రేణుల నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో కాపునేత హరిరామ జోగయ్య ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు.

అయితే నారా లోకేష్ ఇంత స్ట్రాంగ్ గా ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్ మెంటే కారణం అని అంటున్నారు పరిశీలకులు. గతంలో ఒక బహిరంగ సభలో మాట్లాడిన పవన్... ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా వెళ్లి వీర‌మ‌ర‌ణం పొంద‌లేన‌ని అన్నారు. అంటే... 2019 ఎన్నికల్లో జనసేన ఒక చోట గెలిచినా, పవన్ రెండు చోట్లా ఓడిపోవడాన్ని గుర్తు చేశారు! ఈ ఒక్కమాటే నారా లోకేష్ తాజా స్టేట్ మెంట్ కు ఇచ్చిన సంపూర్ణ బలం అని అంటున్నారు విశ్లేషకులు.

ఇలా ఎప్పుడైతే తాను ఒంటరిగా పోటీ చేయలేనని ముందుగానే తన బలహీనతను బహిరంగంగా వెల్లడించారో... అప్పటినుంచి టీడీపీ శ్రేణులకు బలం పెరిగిందని అంటున్నారు. పార్టీ పెట్టిన ప‌దేళ్ల త‌ర్వాతైనా క‌నీసం ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితుల్లో ఉన్న పవన్... ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆ ముచ్చట తీర్చుకోవాలని భావిస్తున్నారనే కామెంట్లు టీడీపీ నుంచి ఆఫ్ ద రికార్డ్ వినిపిస్తున్నాయనేది ఇప్పుడు మరో కీలక అంశంగా ఉంది.

మరోపక్క ప్రతి మీటింగ్‌ లోనూ చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అని అటు జనసైనికులకు, ఇటు టీడీపీ శ్రేణులకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ప‌రోక్షంగా చెప్పారంటూ టీడీపీ నేతలు చెబుతున్న పరిస్థితి! వాస్తవ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ... పవర్ షేరింగ్ అంటూ పెద్ద పెద్ద మాటలు వినిపించడాన్ని టీడీపీ శ్రేణులు తప్పుపడుతున్నారని తెలుస్తుంది.

దీంతో ఇక ఈ విషయాన్ని నాన్చడం సరైంది కాదనే ఉద్దేశంతోనే లోకేష్ ఈ విషయంపై కన్ క్లూజన్ ఇచ్చారని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో సీఎం ఎవరనేదీ శాసనసభా పక్షం సమావేశమై నిర్ణయించుకుంటుందని నాదెండ్ల మనోహర్ ప్రకటించడం కూడా.. పరోక్షంగా ఎక్కువ సీట్లు గెలుచుకున్న వారే సీఎం అయ్యే ఛాన్స్ ఉందని చెప్పినట్లయ్యిందని అంటున్నారు.

దీంతో... ఇకపై సెకండ్ థాట్ కి వెళ్లకుండా జనసైనికులు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి రావడానికి, చంద్రబాబు సీఎం అవ్వడానికి పనిచేసుకుపోవాలని చెప్పకనే చెప్పినట్లయ్యిందని అంటున్నారు విశ్లేషకులు! ఏది ఏమైనా... ఈ డిస్కషన్ కి అటు లోకేష్, ఇటు మనోహర్ ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చి ఇష్యూని మ్యూట్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!