Begin typing your search above and press return to search.

వరుస ఎదురుదెబ్బలు లోకేశ్ ను ఎంతలా మార్చేశాయి

ఇనుము కానీ ఇత్తడి కానీ.. లోహాలు మాత్రమే కాదు మనిషి సైతం దెబ్బలు తగులుతుంటే.. రాటు దేలుతారు

By:  Tupaki Desk   |   16 Jun 2024 8:53 AM GMT
వరుస ఎదురుదెబ్బలు లోకేశ్ ను ఎంతలా మార్చేశాయి
X

ఇనుము కానీ ఇత్తడి కానీ.. లోహాలు మాత్రమే కాదు మనిషి సైతం దెబ్బలు తగులుతుంటే.. రాటు దేలుతారు. లోహాలకు దెబ్బల నొప్పి ఉండదు. మనిషి మాత్రం అందుకు భిన్నం. దెబ్బల నొప్పి తాత్కాలికమైనా.. వాటి ద్వారా నేర్చుకునే గుణపాఠాలు జీవితకాలానికి సరిపడా అన్నట్లుగా మారతాయి. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేశ్ తీరు అలానే ఉంది. చంద్రబాబు రాజకీయ వారసుడిగా అరంగేట్రం చేసినప్పుడు చేతిలో అధికారం ఉంది. కానీ.. అసలు ఆట మొత్తం అధికారం చేజారిన తర్వాతే మొదలైంది.

రాజకీయాల్లో ఉండి చేతిలో అధికారం లేకపోతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయన్న విషయాన్ని ప్రతి రోజూ ఆయనకు ఏదో ఒక రూపంలో ఎదురయ్యేది. ఒక రాజకీయ పార్టీ అధినేత కొడుక్కి ఎదురుకానన్ని చీత్కారాలు.. ఎటకారాలు.. ఎదురుదెబ్బలు.. ఇది అది అన్న తేడా లేకుండా బాగానే దెబ్బలు తిన్నారు. లోకేశ్ లోని సానుకూల అంశం ఏమంటే.. ఇలాంటి ఎదురుదెబ్బలకు నెగిటివ్ గా ఆలోచించి.. నెగిటివ్ గా రియాక్టు కావటం ఒక పద్దతి. అందుకు భిన్నంగా ప్రతి ఎదురుదెబ్బను తనకు అవకాశంగా మార్చుకొని.. తన లోపాల్ని అధిగమించేలా.. మరింత కష్టపడుతూ తాను తిన్న దెబ్బలు మరోమారు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఉంటుంది.

లోకేశ్ రెండో కోవకు చెందుతారు. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చేతికి వచ్చిన అధికారాన్ని ఆయన ఇప్పుడు కొత్త కోణంలో చూస్తున్నారు. తనకు ఎదురైన ఎదురుదెబ్బల నేపథ్యంలో సానుకూలంగా స్పందిస్తూ.. ప్రజల ఆదరణ పొందేందుకు వీలుగా అడుగులు వేస్తున్నారు. ఎదుగుతూ ఒదిగి ఉంటూ.. ఇప్పటికే తన తీరుతో మనసుల్ని దోచేస్తున్న లోకేశ్.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అందరి ఎదుట జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాళ్లకు నమస్కారం చేయటం.. పవన్ స్వయంగా వారించినా ఆయన్ను తన మాటలతో కన్వీన్స్ చేసి కాళ్లకు దండం పెట్టిన వైనం చూసిన వారంతా లోకేశ్ తీరును ప్రశంసించకుండా ఉండలేకపోయారు. తెలుగుతమ్ముళ్ల మనసుల్నే కాదు.. జనసైనికుల గుండెల్ని సైతం నేరుగా తాకేశారు.

ఎన్నికలకు ముందు వరకు జనసైనికులకు పెద్దగా కనెక్టు కాని లోకేశ్.. ఇప్పుడు అందుకు భిన్నంగా జనసైనాని తర్వాత అతన్నే ఎక్కువగా అభిమానిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. నిజానికి లోకేశ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు.. అంతకు ముందు తెర వెనుక ఉండి వర్కు చేసినప్పుడు రాని మైలేజీ.. ఇప్పుడు సొంతం చేసుకుంటున్నారు. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ తో పాటు.. ఆయన పరివారానికి సైతం థ్యాంక్స్ చెప్పాలి.

నిత్యం పప్పు పప్పు అంటూ అదే పనిగా ర్యాగింగ్ చేసిన వైసీపీ నేతలు.. మరీ ముఖ్యంగా కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. ఆర్కే రోజాల పుణ్యమా అని ఈ రోజు లోకేశ్ ఇలా మారారని చెప్పాలి. తన ప్రత్యర్థులు తన వైపు వేలెత్తి చూపే ప్రతి అంశాన్ని ఆయన సరిదిద్దుకోవటం గమనార్హం. తన తెలుగుతో దొర్లే తప్పులతో ఒకప్పుడు ట్రోల్ అయ్యే లోకేశ్ ఇప్పుడు వేలెత్తి వంక పెట్టలేని రీతిలో మారారు.

బాడీ సైజ్ మొదలు బాడీ లాంగ్వేజ్ వరకు.. ఇది.. అది అన్న దానితో సంబంధం లేకుండా తనను తాను సంపూర్ణంగా మార్చుకోవటానికి ఉన్న దేన్ని వదిలిపెట్టలేదు. కష్టపడి వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినా.. అంతకు ముందు యాత్ర చేసిన వారికి దక్కిన పేరు ప్రఖ్యాతులు తనకు దక్కకున్నా.. ఓర్పుగా వెయిట్ చేయటం.. మరింత కష్టపడ్డారు. మంగళగిరిలో అధిక మెజార్టీతో గెలవటం ద్వారా తానేమిటన్నది చేతల్లో చేసి చూపించారు. ఇప్పుడు ఎవరూ లోకేశ్ ను పప్పు అనే మాటను మాట వరసకు అనే ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే.. ఆయన ఎంత నిప్పు అన్నది ఇప్పటికే ఆయన రాజకీయ ప్రత్యర్థులకు బాగా అర్థమైందని చెప్పక తప్పదు.