Begin typing your search above and press return to search.

మాట‌కు మాట‌.. 'దెక్క‌న్ క్రానిక‌ల్'వివాదం.. దుమ్మురేపుతోందిగా!

అయితే.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి నారాలోకేష్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. దెక్క‌న్ క్రానిక‌ల్ రాసిన వార్త‌ను ఆయ‌న 'పెయిడ్ ఆర్టిక‌ల్‌'గా అభివ‌ర్ణించారు.

By:  Tupaki Desk   |   11 July 2024 4:15 AM GMT
మాట‌కు మాట‌.. దెక్క‌న్ క్రానిక‌ల్వివాదం.. దుమ్మురేపుతోందిగా!
X

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రించేందుకు ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం.. ఓకే చెప్పింద‌ని.. ఇటీవ‌ల చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న లో దీనికి గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చారంటూ.. ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక 'దెక్క‌న్ క్రానిక‌ల్' ప్ర‌చురించిన వార్త‌.. ఏపీలో రాజ‌కీయం గా దుమ్ము రేపుతోంది. ఈ వార్త‌పై అధికార ప‌క్షానికి.. ప్ర‌తిప‌క్షం వైసీపీకి మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ విష‌యంలో టీడీపీ యువ నాయ‌కులు విశాఖ‌లోని ప‌త్రిక కార్యాల‌యం ముందు క‌ట్టిన బోర్డును త‌గ‌ల‌బెట్టిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై వైసీపీ అధినేత జ‌గ‌న్ వెంట‌నే రియాక్ట్ అయ్యారు.

నిజానికి.. జ‌గ‌న్ ఇటీవ‌ల కాలంలో ఏం జ‌రిగినా రియాక్ట్ కావ‌డం లేదు. కానీ, ఈ విష‌యంలో మాత్రం చాలా ఉత్సాహం చూపిం చారు. ఈ ఉత్సాహం కూడా.. వివాదానికి దారితీసింది. టీడీపీ పిరికితనంతో దెక్కన్ క్రానికల్ ఆఫీసుపై దాడి చేసిందంటూ.. మాజీ సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 'నిష్పక్షపాతం'తో పనిచేసే మీడియాను అణచివేస్తున్నార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇది యావ‌త్‌ మీడియాపై జ‌రిగిన దాడిగా జ‌గ‌న్ పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయింద‌న్నారు.

అయితే.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి నారాలోకేష్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. దెక్క‌న్ క్రానిక‌ల్ రాసిన వార్త‌ను ఆయ‌న 'పెయిడ్ ఆర్టిక‌ల్‌'గా అభివ‌ర్ణించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని దాచేసేందుకు.. ప్ర‌భుత్వ ప‌నితీరుపై జ‌రుగుతున్న సాను కూల చ‌ర్చ‌ను దారి మ‌ళ్లించేందుకు జ‌రుగుతున్న కుట్ర‌గా ఆయ‌న పేర్కొన్నారు. వైసీపీ ప్రోద్బలంతో ప్రచురించిన స్వచ్ఛమైన పెయిడ్, కల్పిత కథనం అని నిప్పులు చెరిగారు. రాష్ట్ర నాశ‌నాన్ని కోరుకుంటున్న 'బ్లూమీడియా' చేస్తున్న దుష్ప్ర‌చారంగా ఆయ‌న తెలిపారు. దీనిని ప్ర‌తి ఒక్క‌రూ ఖండించాల‌న్నారు.

అంతేకాదు.. విశాఖ స్టీల్ ప్లాంట్ విష‌యంలో ఎన్నిక‌ల‌కు ముందు తాము ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని నారా లోకేష్ చెప్పారు. అయితే.. దెక్క‌న్ క్రానిక‌ల్ డిస్‌ప్లే బోర్డును త‌గ‌ల‌బెట్ట‌డాన్ని తాను కూడా ఖండిస్తున్న‌ట్టు చెప్పారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తామ‌ని లోకేష్ చెప్పారు. చంద్ర‌బాబు పాల‌న‌పై జ‌రుగుతున్న కుట్ర‌ను ప్ర‌తి ఇంటికీ వివ‌రించాల‌న్నారు.

మీడియా ఆందోళ‌న‌..

విశాఖ‌లోని 'దెక్క‌న్ క్రానిక‌ల్' కార్యాల‌యం ఎదుర‌గా ఏర్పాటు చేసిన డిస్ ప్లే బోర్డును టీడీపీ కార్య‌క‌ర్త‌లు ద‌హ‌నం చేయ‌డాన్ని జ‌ర్న‌లిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా.. మీడియాపై దాడులు జ‌రుగుతున్నాయ‌ని జ‌ర్న‌లిస్టు సంఘాల నాయ‌కులు దుయ్య‌బ‌ట్టారు. జ‌ర్న‌లిస్టుల‌కు.. ప‌త్రికా కార్యాల‌యాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన ప్ర‌భుత్వాలు.. చోద్యం చూస్తున్నాయ‌ని ఏపీయూడ‌బ్ల్యూజే నాయ‌కులు వ్యాఖ్యానించారు. మొత్తానికి 'దెక్క‌న్ క్రానిక‌ల్' వివాదం.. దుమ్మురేపుతోంది. మ‌రి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.