Begin typing your search above and press return to search.

బాబు పవన్ పక్కన ఆయన లేడేంటి...!?

ఈ సభలో టీడీపీ భావి రాజకీయ వారసుడు నారా లోకేష్ ఎక్కడా కనిపించకపోవడం మాత్రం అందరిలో చర్చగా ఉంది

By:  Tupaki Desk   |   29 Feb 2024 11:26 AM GMT
బాబు పవన్ పక్కన ఆయన లేడేంటి...!?
X

చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలసి తాడేపల్లిగూడెం జెండా సభలో కనిపించారు. ఈ సభని రెండు పార్టీలు ఉమ్మడి జాబితా రిలీజ్ తరువాత నిర్వహించిన తొలి సభ. రెండు పార్టీల శ్రేణులతో నిర్వహిస్తున్న ఈ సభ ఒక విధంగా ఎన్నికల ముందు అత్యంత కీలకం అయినది. దీనిని ప్రతిష్టాత్మకంగా నివహించారు.

ఈ సభలో టీడీపీ భావి రాజకీయ వారసుడు నారా లోకేష్ ఎక్కడా కనిపించకపోవడం మాత్రం అందరిలో చర్చగా ఉంది. ఉత్తరాంధ్రాలో ఇటీవల శంఖారావం సభలను పది రోజుల పాటు నిర్వహించిన లోకేష్ ఆ తరువాత నుంచి కనిపించడంలేదు.

ఇక టీడీపీ అంటే చంద్రబాబుతో చినబాబు కూడా కచ్చితంగా ఉండాల్సిందే. కానీ లోకేష్ రాకపోవడం మాత్రం కొట్టొచ్చిన లోటుగా కనిపించింది. దీని మీద రకరకాలైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పవన్ తో ఆయన పార్టీతో పొత్తులకు చినబాబు సుముఖంగా లేరు అందుకే ఆయన డుమ్మా కొట్టారు అని అంటున్నారు. ఏపీలో సింగిల్ గానే పోటీ చేయాలన్నది లోకేష్ ఆలోచన అని అంటున్నారు. ఈ పొత్తుల వల్ల సీట్ల షేరింగ్ నుంచి కూడా ఇబ్బందులు వస్తాయని లోకేష్ భావించారు అని అంటున్నారు.

పైగా ఈ పొత్తుల వల్ల ఎన్నికల అనంతరం కూడా ఇబ్బందులు వస్తాయని కూడా లోకేష్ అనుకుంటున్నారని కూడా చెప్పుకుంటున్నారు. టీడీపీలో తాను చంద్రబాబుకు అండగా ఉండగా మళ్లీ వేరే వారి అవసరం ఏమిటి అన్నది కూడా లోకేష్ ఆలోచనలుగా ఉన్నాయని అంటున్నారు. ఇక పొత్తులు లేకపోతే ఈసారి గెలవలేమన్నది చంద్రబాబు అభిప్రాయం అని ప్రచారం లో ఉంది.

అయితే పొత్తుల వల్లనే టీడీపీ విజయావకాశాలు తగ్గుతాయని సింగిల్ గా వస్తే ఎదురు ఉండదని లోకేష్ మాట అని అంటున్నారు. దీని మీదనే చంద్రబాబు లోకేష్ ల మధ్య చర్చ జరిగిందని కూడా ప్రచారం సాగుతోంది. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో నిర్మాణం లేదని దానిని కూడా మోయాల్సి వస్తుందని పొత్తుల వల్ల జరిగేది అదే అన్నది కూడా చినబాబు ఆలోచనలు అంటున్నారు.

అందుకే ఆయన యువగళం పాదయాత్ర తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన మనసులో మాటను కుండబద్ధలు కొట్టారు అని గుర్తు చేస్తున్నారు. టీడీపీ కూటమి గెలిస్తే చంద్రబాబు అయిదేళ్ల పాటు సీఎం గా ఉంటారు అన్నదే లోకేష్ చెప్పిన మాట. అంతే కాదు ఉప ముఖ్యమంత్రులు లాంటి పదవులు ఉండవని కూడా లోకేష్ ఆనాడే చెప్పారు.

అయితే ఇది జనసేనలో చర్చకు దారి తీసింది. ఆగ్రహావేశాలు వారిలో ఉప్పొంగాయి. ఆ తరువాత లోకేష్ పవన్ షేర్ చేసుకున్న సభలు అయితే లేవు. ఈ సభకు లోకేష్ రాకపోవడంతో దాని ప్రభావం ఏమైనా పడిందా అన్న చర్చ కూడా నడుస్తోంది. మరో విషయం కూడా ఇక్కడ ఉంది. ఒక బలమైన సామాజిక వర్గం టీడీపీలో పొత్తులు వద్దు అనే అంటోంది. ఆ వర్గానికి లోకేష్ మద్దతు ఇస్తున్నారు అని అంటున్నారు.

ఇక లోకేష్ చంద్రబాబు తరువాత టీడీపీలో ఫ్యూచర్ లీడర్. రేపటి రోజున కూటమి అధికారంలోకి వచ్చినా జనసేన కూడా రాజకీయంగా ఎదిగితే అది టీడీపీకి ఇబ్బంది అన్న అంచనాలు కూడా ఉన్న వారు లోకేష్ వైపు ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు తరువాత టీడీపీ పగ్గాలతో పాటు సీఎం పదవిని అందుకోవాల్సింది లోకేష్ మాత్రమే అన్నది ఒక బలమైన పార్టీలోని శ్రేయోభిలాషుల వాదన.

కానీ జరిగేది మాత్రం వేరుగా ఉంటోంది. ఈ రోజు జగన్ కోసం మరో పార్టీతో పొత్తు పెట్టుకున్నా రేపు ఆ పార్టీతో కూడా ఇంతకు మించి ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్నారు. బహుశా ఈ రకమైన ఆలోచనల వల్ల కూడా లోకేష్ ఈ సభకు దూరంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంత అన్నది తెలియడం లేదు

వీటికి మించి మరో ప్రచారం కూడా ముందుకు వచింది. అదేంటి అంటే పవన్ సభలో ఉంటే తాను హైలెట్ కానని భావించే లోకేష్ గైర్ హాజరు అయ్యారని అంటున్నారు. అలాగే పవర్ షేరింగ్ గురించి లోకేష్ మాట్లాడిన తరువాత జనసేన నేతలు కూడా ఆయన్ని దూరం పెట్టాలని భావించారని దాని ఫలితమే లోకేష్ సభలో కనిపించలేదని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే టీడీపీలో బాబు తరువాత సర్వం తానే అయిన లోకేష్ ఈ సభలో కనిపించకపోవడం కొత్త చర్చకు దారి తీస్తోంది. చూడాలి మరి ఎందుకు ఆయన రాలేదో, దీని మీద మరెన్ని ప్రచారాలు జరుగుతాయో.