ఏంటి చిన్నబాబూ ఈ మాటలు.. ఎన్నికలున్నాయని తెలియట్లేదా?
కీలకమైన ఎన్నికలు. అందునా.. అధికారంలోకి రావాలని నిర్ణయించుకుని ఆ మేరకు చెమటోడుస్తున్న ఎన్నికలు
By: Tupaki Desk | 23 April 2024 12:30 AM GMTకీలకమైన ఎన్నికలు. అందునా.. అధికారంలోకి రావాలని నిర్ణయించుకుని ఆ మేరకు చెమటోడుస్తున్న ఎన్నికలు. ఇలాంటి సమయంలో ప్రతి ఓటూ.. ప్రతి సీటూ కీలకమే. ఇలాంటి కీలక సమయంలో అంద రినీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎన్నికలకు ముందు ఎలా మాట్లాడినా ప్రతిపక్షంలో ఉన్నారని అందరూ సర్దుకుంటారు. కానీ, ఎన్నికల సమయంలోనూ ఇలానే మాట్లాడితే.. కష్టం కదా! తమను టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయం ఆ వర్గంలో ఏర్పడితే.. వారి ఓట్లే కాదు.. వారు ప్రభావితం చేసే ఓట్లు కూడా పోతాయి.
ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సివస్తోందంటే.. టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన నియోజకవర్గంలో ఉదయాన్నే 8 గంటల నుంచి ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి నోరు జారారు. తమపై కేసులు పెట్టి వేధించిన పోలీసులు, అధికారులను వదిలి పెట్టేది లేదని.. వారి తాట తీస్తామని.. అంతకు అంత అనుభవించేలా చేస్తామని అనేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకి వరంగా మారాయి. దీంతో నారా లోకేష్‌పై వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు.
నిజానికి నారా లోకేష్‌లో బాధ ఉండి ఉంటుంది. తన తండ్రి, మాజీ సీఎం చంద్రబాబును జైల్లో పెట్టడం.. తన పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులు పెట్టడం.. టీడీపీ నేతలను తీసుకెళ్లి వేధించడం వంటివి లోకేష్‌కు ఇబ్బందిగానే ఉంటుంది. దీనిని ఎవరూ కాదనరు. ఈ విషయాన్ని గతంలోనూ ఆయన చెప్పారు. తాము అధికారంలోకి రాగానే తాట తీస్తామని.. కోర్టుల చుట్టూ తిప్పిస్తామని చెప్పారు. అంతేకాదు.. రెడ్ బుక్ రాసుకుంటున్నానని.. ఒక్కక్కరి అంతు చూస్తామని హెచ్చరించారు.
కట్ చేస్తే.. ఆ వ్యాఖ్యలు అక్కడితో ఆగిపోవాలి. ప్రస్తుతం ఎన్నికల సమయం. సో.. ఇష్టం ఉన్నా.. కష్టం ఉన్నా.. అందరినీ ఆకట్టుకునేలా ప్రయత్నించాలి. తమకు అధికారులపై కోపం లేదని.. వైసీపీ నాయకులపైనేనని అని ఉంటే.. ఆ వాదన మరోరూపంలో పోలీసులు.. అదికారులు ఉద్యోగ వర్గాల్లోకి వెళ్తుంది. సానుభూతి కూడా వస్తుంది. కానీ.. దీనికి భిన్నంగా 5వే ల మంది పేర్లు ఉ న్నాయని.. అందరినీ తాట తీస్తామని అనడం ద్వారా.. కీలక ఎన్నికల సమయంలో వారిని టీడీపీకి దూరం చేసుకున్నట్టే అవుతుందని అంటున్నారు పరిశీలకులు. మనసులో ఏమున్నా.. అధికారంలోకి వచ్చే వరకైనా సంయమనం పాటించాలని సూచిస్తున్నారు.