Begin typing your search above and press return to search.

టీడీపీలో లోకేష్ శకం !

టీడీపీలో నారా లోకేష్ శకం మొదలైంది. నారా లోకేష్ పాత్ర జూన్ 4 ఫలితాల తరువాత అత్యంత కీలకంగా ఉంటుందని అంటున్నారు

By:  Tupaki Desk   |   17 May 2024 2:45 AM GMT
టీడీపీలో లోకేష్ శకం !
X

టీడీపీలో నారా లోకేష్ శకం మొదలైంది. నారా లోకేష్ పాత్ర జూన్ 4 ఫలితాల తరువాత అత్యంత కీలకంగా ఉంటుందని అంటున్నారు. నారా లోకేష్ 2009 నుంచి టీడీపీ ఎన్నికల రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఆయన అప్పట్లో తెర చాటుగా ఉంటూ వచ్చారు. అది కాస్తా 2014 నాటికి ప్రత్యక్షంగా మారింది. ఆనాడు తండ్రి చంద్రబాబుకు తోడుగా నారా లోకేష్ రాజకీయాలను పంచుకుంటూ వచ్చారు.

ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో మూడేళ్ళు ఆగి ప్రభుత్వం కుదురుకున్నాక 2017లో లోకేష్ ఎమ్మెల్సీగా నెగ్గి అయిదు మంత్రిత్వ శాఖలతో బాబు కేబినెట్ లో మంత్రిగా చేరారు. ఆయన ఐటీ మంత్రిగా తనదైన శైలిలో రాణించారు అని చెబుతారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా కొంత ముద్ర వేయగలిగారు. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా లోకేష్ ఓటమి పాలు అయ్యారు.

ఆయన మంత్రిగా మంగళగిరి నుంచి పోటీ చేస్తే అయిదు వేల ఓట్ల తేడాతో పరాజయం చవిచూసారు. అయితే లోకేష్ లోని కొత్త కోణం ఆనాటి నుంచే బయటకు వచ్చింది. ఆయన ఓడిన చోటనే గెలవాలని పంతం పట్టి మరీ అయిదేళ్ళ పాటు మంగళగిరినే అట్టిపెట్టుకున్నారు. అక్కడ జనాలతో కనెక్ట్ అయ్యారు. ఎంతలా అంటే బలమైన బీసీ వర్గాలు సైతం లోకేష్ ని గెలిపించాలని ఆలోచనకు రావడం అంటే అది ఆయన కష్టానికి ప్రతిఫలం అని అంటున్నారు.

ఇక చూసుకుంటే ఈసారి ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ గెలుస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు మంచి మెజారిటీ కూడా వస్తుందని అంటున్నారు. గత కొన్ని ఎన్నికలు చూస్తే అతి తక్కువ మెజారిటీతోనే ఎవరైనా నెగ్గుతున్నారు. కానీ లోకేష్ కి భారీ మెజారిటీయే రావడం ఖాయమని అంటున్నారు.

లోకేష్ ఈసారి ఎమ్మెల్యేగా అడుగుపెడతారు అని టీడీపీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి. లోకేష్ గెలుపుతో పాటు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే అటు ప్రభుత్వంలో ఆయన అతి ముఖ్య పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. ఆయనకు చంద్రబాబు ముఖ్యమైన శాఖలే ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. ఐటీ శాఖనే లోకేష్ మరోసారి తీసుకుంటారు అని అంటున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ పరంగానూ ప్రభుత్వంలోనూ ఈసారి లోకేష్ మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తారు అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ అన్నింటా పై చేయిగా ఉంటారని అంటున్నారు. చంద్రబాబు సీఎం అయినా లోకేష్ తోనే అంతా అన్నట్లుగా సాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈసారి టీడీపీ గెలిస్తే లోకేష్ జాతకం కూడా ఎక్కడికో వెళ్ళిపోతుందని ఈ అయిదేళ్ళ టీడీపీ టెర్మ్ లో అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకోవడం ఖాయం అది కాస్తా లోకేష్ సీఎం పదవికి చేరువ అయినా ఆశ్చర్యం లేదు అన్న ప్రచారం సాగుతోంది.

ఇవన్నీ పక్కన పెడితే ఏడున్నర పదుల వయసులో ఉన్న చంద్రబాబుకు ఈసారి ఎన్నికలు దాదాపుగా చివరివి అని అంటున్నారు. ఆయన ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే మాత్రం దానిని మరింత కాలం కాపాడుకోవాల్సిన అతి ముఖ్య బాధ్యత లోకేష్ మీద ఉందని అందువల్ల ఆయన ఇప్పటికి పది రెట్లు బిజీగా మారుతారు అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ ప్రభుత్వ బాధ్యతలలో చంద్రబాబుకు మాగ్జిమం బరువుని తగ్గించేలా లోకేష్ రోల్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో నారా లోకేష్ శకం స్టార్ట్ అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. చూడాలి మరి జూన్ 4న ఎవరు అధికారంలోకి వస్తారో ఏమి జరగనుందో.