టీడీపీ పగ్గాలు లోకేష్ కి అపుడేనా ?
అంటే 2029 ఎన్నికల నాటికి లోకేష్ ని తీర్చిదిద్ది ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించి అపుడు జనామోదం కోసం వదులుతారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 20 May 2024 3:50 AM GMTనారా లోకేష్ లక్ కలసి వస్తే ఈపాటికి సీఎం అయ్యేవారు. ఆయన 2017లోనే అంటే 34 ఏళ్ళ వయసులోనే అయిదు కీలక మంత్రిత్వ శాఖలను చూసారు. తలపండిన వారికి ఇచ్చే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలను ఆయన అతి పిన్న వయసులో చూశారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికి సీఎం అభ్యర్ధిగా ప్రొజెక్ట్ అయి ఉండేవారు.
కానీ అలా జరగలేదు. దాంతోనే ఈసారి ఎన్నికల్లో టీడీపీ లైఫ్ అండ్ డెత్ అన్నట్లుగా పోరాడింది. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ కి ఏ బాధ్యతలు అప్పగిస్తారు అన్నది చర్చగా ఉంది. ముఖ్యంగా టీడీపీలో అయితే యూత్ వింగ్ అంతా లోకేష్ కే పార్టీ పగ్గాలు అప్పగించాలని అలా బాబు ముఖ్యమంత్రి పదవికే పరిమితం కావాలని కోరుకుంటున్నారు.
అపుడు ప్రభుత్వంలో బాబు పార్టీని లోకేష్ కలసి జోడు గుర్రాల మాదిరిగా పరుగులు పెట్టిస్తారు అని అంటున్నారు. అయితే దీని మీద సీనియర్ల భావన వేరేగా ఉంది అని అంటున్నారు. లోకేష్ కి ఇపుడే పార్టీ పగ్గాలు అప్పగించడం తొందరపాటు అవుతుందని అంటున్నారు. లోకేష్ వరకూ చూస్తే ఆయన యువగళం పాదయాత్ర చేశారు. జనాలతో బాగానే కనెక్ట్ అయ్యారు. ఆయన ఒక విధంగా చెప్పాలీ అంటే గత అయిదేళ్లలో బాగా మెరుగు పడ్డారు.
కానీ ఇంకా ఆయన రాటు తేలాలీ అన్నదే సీనియర్ల భావనగా చెబుతున్నారు. ఇక ఈసారి కూటమి అధికారంలోకి వచ్చినా బాధ్యతలు సవాళ్ళూ అంతే స్థాయిలో ఉంటాయి కాబట్టి బాబు మాత్రమే వాటిని తట్టుకోగలరని అందుకే ఆయనే అధ్యక్షుడిగా అలాగే సీఎం గా అయిదేళ్ళూ కొనసాగాలని అనుభవం పండిన వారు అంతా కోరుకుంటున్నారుట.
ఓడినా వైసీపీ బలంగానే ఉంటుంది కాబట్టి విపక్షానికి ఏ ఒక్క చాన్స్ ఇవ్వకూడదు అన్నది కూడా వ్యూహంలో భాగం అంటున్నారు. మరో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే లోకేష్ ని మంత్రిగా తీసుకుని ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించాలన్నది బాబుకు సీనియర్ల సూచనగా ఉంది. అలా బాబు ముఖ్యమంత్రిత్వంలో లోకేష్ సమర్ధ మంత్రిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ జనం మన్ననలు పొందిన తరువాత 2029 నాటికి ఆయనను సీఎం అభ్యర్ధిగా ప్రొజెక్ట్ చేయడంతో పాటు అప్పటికి ఆయనకు పార్టీ అధ్యక్ష పదవితో పట్టాభిషేకం చేయడం ఉత్తమం అని అంటున్నారు.
అంటే 2029 ఎన్నికల నాటికి లోకేష్ ని తీర్చిదిద్ది ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించి అపుడు జనామోదం కోసం వదులుతారు అని అంటున్నారు. ఈ అయిదేళ్ల పాటు ఆయన మంత్రిగా తన బాధ్యతలతో జనాలను మెప్పించే విధంగా పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక బాబు వయసు ఏడున్నర పదులు అయినా ఆయన ఈ రోజుకీ మంచి ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సులువుగా అయిదేళ్ళ పాటు సీఎం గా చేసి టీడీపీని ప్రభుత్వాన్ని పూర్తి పరిపుష్టి చేయగలరు అని సీనియర్లు బలంగా నమ్ముతున్నారు.
మొత్తానికి చూస్తే లోకేష్ బాబుని అత్యున్నత పదవిలో చూడాలని యువ నేతలు టీడీపీలో ఆరాటపడుతూంటే దానికి మరో అయిదేళ్ల సమయం పట్టవచ్చు అన్నది సీనియర్ల మనోగతం బట్టి అర్ధం అవుతోంది అని అంటున్నారు. ఏది ఏమైనా రానున్న అయిదేళ్ల పాటు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో తండ్రికి అన్ని విధాలుగా అండగా లోకేష్ ఉంటూ కీలకమైన భూమికనే పోషిస్తారు అని అంటున్నారు. సో లోకేష్ టీడీపీలో ఎపుడూ కీ రోల్ నే ప్లే చేస్తారు కానీ సీఎం కావాలన్నా టీడీపీ ప్రెసిడెంట్ అవాలన్న ఉందిలే మంచి కాలం ముందు ముందునా అంటున్నారు టీడీపీలోని తమ్ముళు. ఇదే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది మరి.