టీడీపీ గెలుపు వేళ.. టీ కొట్టి యజమాని బషీర్ చేసిన పనికి లోకేశ్ ఫిదా
తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత బంపర్ మెజార్టీతో సాధించిన ఘన విజయంతో తెలుగు తమ్ముళ్లు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
By: Tupaki Desk | 6 Jun 2024 4:23 AM GMTతెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత బంపర్ మెజార్టీతో సాధించిన ఘన విజయంతో తెలుగు తమ్ముళ్లు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీలో మారిన రాజకీయ వాతావరణంలో గెలుపు కోసం జరిగిన హోరాహోరీ ఎన్నికల విజయాన్ని తమ సొంత విజయంగా భావిస్తున్న టీడీపీ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. వీరికి కాస్త భిన్నంగా వ్యవహరించిన కొత్త చెరువు బషీర్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు.
రోడ్డు పక్కన టీ బంక్ నిర్వహించే బషీర్ ది ఉమ్మడి అనంతపురం జిల్లా (శ్రీ సత్యసాయి జిల్లా) కొత్త చెరువు మండలం. టీడీపీ సాధించిన చారిత్రక విజయానికి సంబరపడిపోయిన ఈ సాదాసీదా వ్యక్తి.. బుధవారం మొత్తం టీని ఉచితంగా పంపిణీ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. టీడీపీ సాధించిన ఘన విజయానికి బదులుగా.. ఆయన తన షాపు వద్ద ‘‘ఈ రోజు టీ ఫ్రీ’’ అంటూ బోర్డు పెట్టి మరీ రోజంతా టీ పంపిణీ చేశారు.
ఏపీలో టీడీపీ కూటమి భారీ మెజార్టీతో గెలుపొందటంపై స్పందించిన బషీర్ మాట్లాడుతూ.. తెలుగుదేశం గెలుపుతో ఎంతో ఆనందంగా ఉన్నానని.. అందుకే తన వంతుగా తాను ఇలా ఉచితంగా టీ పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు. బషీర్ గురించి తెలిసినంతనే తన ట్విటర్ ఖాతాలో (ఎక్స్) పోస్టు చేశారు నారా లోకేశ్. బషీర్ అభిమనానికి తాను ఫిదా అయ్యానని పేర్కొన్నారు. ‘‘టీడీపీ కూటమి ఘనవిజయం సాధించి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్న సందర్భంగా కొత్తచెరువు మండల కేంద్రంలో రోజంతా అందరికీ ఉచితంగా టీ అందించిన బషీర్ అభిమానానికి ఫిదా అయ్యాను’’ అంటూ పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.