విశాఖ మంత్రిగా లోకేష్ ?
అలా ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే వంగలపూడి అనిత ఒక్కరే మంత్రివర్గంలో ఉన్నారు.
By: Tupaki Desk | 30 Jun 2024 4:02 AM GMTచంద్రబాబు మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఒక్కో జిల్లాకు ముగ్గురేసి మంత్రులు ఉంటే కొన్ని జిల్లాలలో ఒక్కరే ఉన్నారు. అలా ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే వంగలపూడి అనిత ఒక్కరే మంత్రివర్గంలో ఉన్నారు. అయితే ఆమెకు ప్రాధాన్యత కలిగిన హోం శాఖను ఇచ్చారు.
అయితే ఆమె కొత్తగా ఏర్పాటు చేసిన అనకాపల్లి జిల్లా కోటాలో మంత్రిగా ఉంటే విశాఖ జిల్లాకు జీరో అన్న దాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాగే అనకాపల్లి జిల్లాకే రెండు మంత్రి పదవులూ ఇచ్చేసి విశాఖ జిల్లాను పక్కన పెట్టేసింది.
అలా విశాఖకు మంత్రి లేరు అని టీడీపీయే నాడు విమర్శలు చేసింది. విశాఖ పాలనా రాజధాని అంటున్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని కూడా విమర్శించారు. ఇపుడు అవే మాటలు తమ సొంత ప్రభుత్వం మీద అనలేక అంతర్గతంగా రగులుతున్నారు.
ఇదిలా ఉంటే విశాఖ మంత్రిగా ఎవరూ లేరన్న కొరతను తీర్చేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ప్రతీ జిల్లాకూ ఇంచార్జి మంత్రిని నియమిస్తారు. అలా చూస్తే విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రిగా నారా లోకేష్ ఉంటారని అంటున్నారు.
విశాఖకు ఉన్న రాజకీయ ఆర్ధిక సామాజిక ప్రాధాన్యత రిత్యా నారా లోకేష్ జిల్లా మంత్రిగా వస్తారు అని అంటున్నారు. ఇదే విషయం ఇపుడు టీడీపీలో చర్చగా సాగుతోంది. విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి అంటే ఆయన చేతుల మీదుగానే అన్ని అభివృద్ధి పనులు సాగుతాయి. ప్రతీ రెండు నెలలకోసారి జిల్లా అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించి దానికి ఇంచార్జి మంత్రి అధ్యక్షత వహిస్తారు. జిల్లా ఇంచార్జి మంత్రి అంటే పవర్ ఫుల్ అని చెప్పాలి.
పైగా విశాఖలోనే స్టీల్ ప్లాంట్ ఉంది. ఏయూ ఉంది. విశాఖ అంతా టీడీపీకీ మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేలను గెలిపించింది. దాంతో అన్ని విధాలుగా ప్రాముఖ్యత దృష్ట్యా లోకేష్ ఇంచార్జి మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు అని అంటున్నారు. దాంతో లోకేష్ కేవలం విశాఖకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్రా జిల్లాల రాజకీయాలను కూడా చక్కబెడతారు అలా లోకేష్ ఫుల్ ఫోకస్ ఉత్తరాంధ్రా మీద పెట్టబోతున్నారు అని అంటున్నారు.