అక్టోబర్ లో జగన్... నవంబర్ లో లోకేష్
ఏపీ రాజకీయాలను కాక పుట్టించేందుకు సరికొత్త వేదిక తయారవుతోంది.
By: Tupaki Desk | 6 Aug 2023 3:00 AM GMTఏపీ రాజకీయాలను కాక పుట్టించేందుకు సరికొత్త వేదిక తయారవుతోంది. ఇప్పటిదాకా చూస్తే ఉమ్మడి ఏపీలో అయినా విభజన ఆంధ్రాలో అయినా విజయవాడ రాజకీయ రాజధానిగా ఉంటూ వచ్చింది. అయితే ఆ తలరాతను మారుస్తూ విశాఖ నుంచి రాజకీయాలను నడపాలని వైసీపీ నిర్ణయించింది.
ముఖ్యమంత్రి జగన్ విశాఖకు మకాం అక్టోబర్ 24 నుంచి మార్చేస్తున్నారు. ఆ రోజున విజయదశమి వేళ ఆయన విశాఖలో కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేస్తారు. అలా జగన్ విశాఖ వాసిగా మారిపోతున్నారు. జగన్ విశాఖలో అడుగుపెట్టిన వారం రోజుల తరువాత అంటే నవంబర్ నెల మొదలవుతూన టీడీపీ యువ నాయాకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర విశాఖలో మొదలవుతుంది.
విశాఖ జిల్లాలో ఆయన పదిహేను రోజుల పాటు పాదయాత్ర ఉంటుందని పార్టీ వర్గాలకు ఇప్పటికి అందిన షెడ్యూల్ ప్రకారం తెలుస్తోంది. లోకేష్ విశాఖ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో కలియతిరుగుతారు అని అంటున్నారు. మొత్తం 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర విశాఖ జిల్లాలో సాగనుంది.
అంటే జగన్ విశాఖలో ఉండగానే లోకేష్ కూడా వచ్చి రాజకీయ రచ్చకు శ్రీకారం చుడతారు అన్న మాట. ప్రస్తుతం లోకేష్ పాదయాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. జగన్ ప్రస్తుతం తాడేపల్లిలో ఉంటున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర అంతా జగన్ ఉన్న జిల్లాలో సాగనుంది.
అది అయిన తరువాత జగన్ విశాఖ వస్తున్నారు. జగన్ విశాఖ వచ్చిన వెంటనే లోకేష్ కూడా పాదయాత్రతో వస్తున్నారు. ఇక్కడ కూడా పాదయాత్రతో మాటల తూటాలను పేల్చడానికి టీడీపీ యువ నాయకుడు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి లోకేష్ పాదయాత్రను గుంటూరు తో పాటు విశాఖలోనూ జగన్ చూడాల్సి వస్తోంది అని అంటున్నారు.
ఇక దీని కంటే ముందే పవన్ వారాహి యాత్ర విశాఖలో సాగనుంది. అయితే రానున్న కాలంలో చంద్రబాబు పవన్ కూడా విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలను మరింతగా టార్గెట్ చేస్తారు అని అంటున్నారు. జగన్ విశాఖ మకాం వెనక ఉత్తరాంధ్రాలో వైసీపీని బలోపేతం చేయడమే వ్యూహంగా ఉంది. దాంతో ప్రతిపక్షాలు కూడా ఏ మాత్రం ఈజీగా తీసుకోవని అంటున్నారు.
విజయదశమితో విశాఖలో అడుగుపెడుతున్న జగన్ వైసీపీకి తనకూ విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నారు. అయితే విపక్షాలు మాత్రం రాజకీఎయ సమరానికి తెర తీస్తున్నాయి. దీంతో ఈ ఏడాది దసరా తరువాత విశాఖ రాజకీయ రాజధానిగా మారడం ఖాయమని అంటున్నారు. విశాఖను పాలనా రాజధానిగా చేయడానికి టెక్నికల్ గా అవరోధాలు ఉన్నాయి కానీ రాజకీయ రాజధానికి ఏ అడ్డంకులూ లేవు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ విశాఖ టూర్ పెట్టుకుంటున్నరు. అలాగే కేసీయార్ టూర్ బకాయి ఉంది. మొత్తానికి చూస్తే విశాఖలో సరికొత్త రాజకీయ కాక స్టార్ట్ కానుంది. జగన్ విశాఖ మకాంతో టోటల్ ఏపీ పాలిటిక్స్ వేడెక్కనుంది అంటున్నారు.