Begin typing your search above and press return to search.

వాంగ్మూలం ఇచ్చిన లోకేష్... పోసానిపై పెట్టిన కేసు ఇదే!

యువగళం పాదయాత్రతో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యాత్ర ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:22 AM GMT
వాంగ్మూలం ఇచ్చిన లోకేష్... పోసానిపై పెట్టిన కేసు ఇదే!
X

సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో భాగంగా అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తు ముందుకు కదులుతున్నారు లోకేష్. ఈ సమయంలో తన పాదయాత్రకు శుక్రవారం విరామమిచ్చారు.

అవును... తనపై తప్పుడు ఆరోపణలు చేశరాంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేసులకు సంబంధించి వాగ్మూలం ఇవ్వడం కోసం లోకేష్ తన పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఇందులో భాగంగా ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణముర‌ళి మీద వేసిన కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు చినబాబు పాదయాత్రకు విరామమిచ్చారు.

పోసాని కృష్ణమురళితోపాటు సింగలూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తి కూడా తనపై నిరాధార ఆరోపణలు చేశారని లోకేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో సింగలూరు శాంతి ప్రసాద్, పోసాని కృష్ణమురళిలపై వేర్వేరుగా మంగళగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ రెండు కేసుల్లో వాంగ్మూలం నమోదు కోసం మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టుకి చేరుకున్న లోకేశ్ పిటీషన్ వేశారు.

కాగా... ఓ యూట్యూబ్ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి లోకేశ్‌ పై సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా.. కంతేరులో లోకేష్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేశారని పోసాని ఆరోపించారు. దీనిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంతేరులో అరసెంటు భూమి కూడా లేని తనపై ఈ తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్షమాప‌ణ చెప్పాలని లోకేష్ నోటీసులు పంపించారు.

ఈ నోటీసులపై పోసాని స్పందించకపోవడంతో తన పరువు నష్టం కలిగించారని లోకేష్ కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా... ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సింగలూరి శాంతి ప్రసాద్ కూడా తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినా స్పందించకపోవటంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పిటీషన్ లో పేర్కొన్నారు.

మరోపక్క వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు లోకేష్. ఈ సందర్భంగా... తనపై చేసిన ఆరోపణలకు గానూ నోటీసులు పంపిస్తే వాటిని తీసుకోకుండా పోసాని తప్పించుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు. కంతేరు వద్ద తనకు భూములు ఉన్నట్లయితే ఆ వివరాలను, డాక్యుమెంట్లు తీయించాలని పోసానికి సూచించారు.

ఇదే క్రమంలో తాను పంపిన లీగల్ నోటీస్ తీసుకోకుండా తప్పించుకొన్నా న్యాయస్థానం విచారణకు రప్పించకమానదని తెలిపిన లోకేష్... తనపై చేసిన ఆరోపణలు నిజమైతే వాటికి సంబందించి సాక్ష్యాధారాలన్నిటినీ సిద్దంచేసి పెట్టుకోండని తెలిపారు. అలాకానిపక్షంలో బేషరతుగా తనకు క్షమాపణ చెప్పి రూ.5 కోట్లు చెల్లించాలని సూచించారు.

అనంతరం... గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన మంగళగిరి నుంచే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని లోకేష్ తెలిపారు. ఈసారి భారీ మెజార్టీతో గెలిచి శాసనసభలో అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశారు!